Telangana AI Innovation Hub (TAIH) : సిలికాన్ వ్యాలీ గురించి విన్నాం.. కానీ, ఇప్పుడు మన హైదరాబాద్ కూడా ఆ స్థాయికి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ప్రపంచ టెక్నాలజీని శాసిస్తున్న కృత్రిమ మేధ (AI) రంగంలో తెలంగాణను గ్లోబల్ రాజధానిగా నిలపాలనే మహదాశయంతో రాష్ట్ర ప్రభుత్వం ఓ చరిత్రాత్మక అడుగు ముందుకు వేసింది. యువతకు వేలల్లో ఉద్యోగాలు, లక్షల్లో నైపుణ్య శిక్షణ అందించే లక్ష్యంతో ‘తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్’ (TAIH) ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది.
ఎందుకీ హబ్ : ప్రస్తుతం రాష్ట్రంలో ఏఐకి సంబంధించి ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’, ‘తెలంగాణ ఏఐ మిషన్’, టీ-హబ్ ఆధ్వర్యంలో స్టార్టప్‌లు వంటివి వేర్వేరుగా పనిచేస్తున్నాయి. ఈ విడివిడి కార్యక్రమాల వల్ల ఆశించిన ఫలితాలు వేగంగా రావడం లేదని, ప్రపంచస్థాయిలో అగ్రగామిగా నిలవడంలో జాప్యం జరుగుతోందని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో, ఏఐకి సంబంధించిన అన్ని కార్యక్రమాలను, సంస్థలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి, ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల శక్తిగా తీర్చిదిద్దేందుకే ఈ ‘ఏఐ ఇన్నోవేషన్ హబ్’ను స్థాపిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చొరవతో ఈ ప్రణాళిక కార్యరూపం దాల్చింది. ఫ్యూచర్ సిటీలో 200 ఎకరాల్లో ఏఐ సిటీ నిర్మాణం పూర్తయ్యేలోపు, తాత్కాలికంగా ఓ బహుళ అంతస్తుల భవనంలో ఈ హబ్ తన కార్యకలాపాలు ప్రారంభించనుంది.
ప్రపంచస్థాయి యంత్రాంగం.. స్పష్టమైన లక్ష్యాలు : ఈ హబ్‌ను ప్రపంచస్థాయి ప్రమాణాలతో నడిపేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది.
గ్లోబల్ లీడర్‌షిప్: హబ్‌ను నడిపించేందుకు గ్లోబల్ సీఈఓను నియమిస్తారు. సిలికాన్ వ్యాలీకి చెందిన నిపుణులతో సహా అంతర్జాతీయ మేధావులతో ఒక గవర్నెన్స్ బోర్డును ఏర్పాటు చేస్తారు.
స్వయం సమృద్ధి: మొదటి మూడేళ్ల పాటు ప్రభుత్వం అవసరమైన బడ్జెట్‌ను కేటాయిస్తుంది. ఆ తర్వాత, ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించేలా దీనిని తీర్చిదిద్దుతారు.
మూడేళ్లలో సాధించబోయే లక్ష్యాలు..
ఉద్యోగాలు: 10,000కు పైగా ప్రత్యక్ష ఉద్యోగావకాశాలు కల్పించడం.
నైపుణ్య శిక్షణ: 50,000 మందికి పైగా యువతకు ఏఐలో నైపుణ్య శిక్షణ ఇవ్వడం.
స్టార్టప్‌లు: 250కి పైగా ఏఐ స్టార్టప్‌లను ప్రారంభించడం.
నిధుల సమీకరణ: 100 మిలియన్ డాలర్లకు పైగా ప్రైవేట్ ఫండింగ్‌ను ఆకర్షించడం.
పేటెంట్లు: 50కి పైగా గ్లోబల్ పేటెంట్లు సాధించేలా ప్రోత్సహించడం.
అంతర్జాతీయ భాగస్వామ్యాలు: 25కు పైగా అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు, పరిశోధన ల్యాబ్‌లతో ఒప్పందాలు చేసుకోవడం. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, ఐఐఐటీ, బిట్స్ పిలానీ వంటి దిగ్గజ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ హబ్ ద్వారా వాటన్నింటినీ సమన్వయం చేస్తూ, తెలంగాణను గ్లోబల్ బ్రాండ్‌గా మార్చాలని, తద్వారా భారీ పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఈ క్యాంపస్‌లో స్టార్టప్‌లకు, పరిశోధకులకు, శిక్షణ కేంద్రాలకు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు.


