Integrated sub-registrar offices : రిజిస్ట్రేషన్ పని మీద వెళ్తే గంటల తరబడి పడిగాపులు.. ఏ ఆఫీసు ఎక్కడుందో తెలియని గందరగోళం.. ఇకపై ఈ తిప్పలకు చెక్ పడనుందా? 39 వేర్వేరు కార్యాలయాలను కేవలం 11 కేంద్రాలుగా మార్చడం వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏమిటి? కార్పొరేట్ కార్యాలయాలను తలదన్నేలా రాబోతున్న ఈ సమీకృత సముదాయాల్లో సామాన్యుడికి ఎలాంటి సౌకర్యాలు లభించనున్నాయి..? ఈ బృహత్తర ప్రణాళిక స్వరూపమేమిటో వివరంగా పరిశీలిద్దాం.
ఒకే గూటికి 39 కార్యాలయాలు : రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సులభతరం చేసేందుకు, పారదర్శకతను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 39 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను 11 అత్యాధునిక సమీకృత సముదాయాలుగా మార్చేందుకు శ్రీకారం చుట్టింది. వచ్చే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి వీటిని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రణాళికలో భాగంగా తొలి అడుగు గచ్చిబౌలిలో పడింది. ఇక్కడి ‘తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్’ (తాలిం) ప్రాంగణంలో సమీకృత కార్యాలయ సముదాయ నిర్మాణానికి ప్రభుత్వం బుధవారం శ్రీకారం చుట్టింది.
గచ్చిబౌలి కేంద్రం – ఓ నమూనా : రియల్ ఎస్టేట్ రంగం ఉచ్ఛస్థితిలో ఉన్న రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక్కడి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు నిత్యం జనంతో కిటకిటలాడుతుంటాయి. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని, తొలి సమీకృత సముదాయాన్ని గచ్చిబౌలిలో నిర్మిస్తున్నారు.
ఏకీకృతం కానున్నవి: శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, గండిపేట సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు, రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం కూడా ఇదే భవనంలోకి మారనుంది.
ప్రయోజనం: నలుగురు సబ్-రిజిస్ట్రార్లు, ఒక జిల్లా రిజిస్ట్రార్ ఒకేచోట ఉండటం వల్ల పర్యవేక్షణ పెరిగి, పనితీరు మెరుగుపడుతుంది. అవినీతికి ఆస్కారం తగ్గుతుంది.
కార్పొరేట్ హంగులతో సౌకర్యాలు : ఈ సమీకృత భవనాలను కేవలం కార్యాలయాలుగా కాకుండా, ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించే కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నారు. మూడు అంతస్తుల్లో, ఒక్కో అంతస్తు 16 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు.
విశాలమైన నిరీక్షణ గదులు (వెయిటింగ్ హాల్స్)
వివాహ రిజిస్ట్రేషన్ల కోసం ప్రత్యేక హాల్
వృద్ధులు, దివ్యాంగుల కోసం ర్యాంప్, వీల్‌చైర్ సదుపాయం
పసిపిల్లల తల్లుల కోసం ఫీడింగ్ రూం, చిన్నారుల కోసం క్రష్
300 కార్లు, ద్విచక్ర వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్
పర్యావరణ హితంగా సౌర విద్యుత్తు వినియోగం, కేఫ్ సౌకర్యం
రాబోయే సమీకృత కేంద్రాలు : గచ్చిబౌలితో పాటు, నగరం నలువైపులా మరో 10 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు..
మలక్‌పేట: అజాంపుర, చార్మినార్, దూద్‌బౌలి కార్యాలయాలు.
బంజారాహిల్స్: రోడ్ నెం.10 బంజారాహిల్స్, గోల్కొండ, ఎస్సార్‌నగర్.
కోహెడ: పెద్ద అంబర్‌పేట, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, వనస్థలిపురం.
మంఖాల్: శంషాబాద్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం.
కండ్లకోయ: కుత్బుల్లాపూర్, కీసర, శామీర్‌పేట, మేడ్చల్.
బోడుప్పల్: ఉప్పల్, నారపల్లి, కాప్రా, ఘట్‌కేసర్, మల్కాజిగిరి. వీటితో పాటు కూకట్‌పల్లి, రెడ్‌హిల్స్, పటాన్‌చెరు, ఎల్బీనగర్ ప్రాంతాల్లోనూ మరో నాలుగు సముదాయాల కోసం స్థలాలను గుర్తించాల్సి ఉంది. ఈ బృహత్తర ప్రణాళిక పూర్తయితే రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో సరికొత్త శకానికి నాంది పలికినట్లే.


