Javelin throw talent in Telangana : ఒకప్పుడు అథ్లెటిక్స్ అంటే పరుగు పందెం, హైజంప్, లాంగ్ జంప్ మాత్రమే. కానీ, టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా విసిరిన ఒక్క బల్లెం దెబ్బకు దేశంలో క్రీడా సమీకరణాలు మారిపోయాయి. ఆ బంగారు బరిసె ఇప్పుడు తెలంగాణ పల్లెల్లోని యువతకు కొత్త దారి చూపుతోంది. ఆగస్టు 7న ‘జాతీయ జావెలిన్ త్రో దినోత్సవం’ జరుపుకుంటున్న వేళ, నీరజ్ చోప్రాను స్ఫూర్తిగా తీసుకుని, పతకాల పంట పండిస్తున్న మన మట్టిలో మాణిక్యాలపై ప్రత్యేక కథనం. ఇంతకీ ఎవరా యువ కెరటాలు..? వారి విజయ ప్రస్థానం ఎలా సాగుతోంది..? తెలుసుకుందాం పదండి.
నీరజ్ స్ఫూర్తి… పల్లెల్లో ప్రతిభ : భారత అథ్లెటిక్స్‌కు నీరజ్ చోప్రా స్వర్ణ పతకం అందించిన ఆగస్టు 7వ తేదీని, భారత అథ్లెటిక్స్ సమాఖ్య ‘జాతీయ జావెలిన్ త్రో దినోత్సవం’గా ప్రకటించింది. ఈ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా వర్ధమాన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా త్వరలో జనగామలో రాష్ట్ర స్థాయి పోటీలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గిరిజన క్రీడా పాఠశాలల నుంచి ఎందరో యువ క్రీడాకారులు జావెలిన్ త్రోలో అద్భుత ప్రతిభ కనబరుస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు.
పతకాల వీరులు :మహేశ్, వికారాబాద్: ఆదిలాబాద్ క్రీడా పాఠశాలలో శిక్షణ పొందుతున్న మహేశ్, కోచ్ రమేశ్ పర్యవేక్షణలో రాటుదేలుతున్నాడు. హనుమకొండలో జరిగిన సీఎం కప్‌లో 39.59 మీటర్లు విసిరి కాంస్యం సాధించగా, హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి ఛాంపియన్‌షిప్‌లో ఏకంగా 46.70 మీటర్ల దూరం బల్లెం విసిరి బంగారు పతకాన్ని ముద్దాడాడు. ఇటీవల జరిగిన సౌత్‌జోన్ పోటీల్లోనూ కాంస్య పతకం గెలిచి తన సత్తా చాటాడు.
పెందూర్ సతీశ్ కుమార్, నార్నూర్: ఉట్నూరు గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాల విద్యార్థి అయిన సతీశ్, బరిలోకి దిగితే పతకం ఖాయమనే పేరు తెచ్చుకున్నాడు. కోచ్ సునంద్ మార్గదర్శకత్వంలో రాష్ట్రస్థాయిలో 6 స్వర్ణాలు, 4 రజతాలు, 3 కాంస్యాలతో సహా మొత్తం 13 పతకాలు సాధించాడు. అంతేకాదు, వరంగల్‌లో జరిగిన జాతీయ స్థాయి సౌత్‌జోన్ పోటీల్లో అండర్-14 విభాగంలో 54.68 మీటర్లు విసిరి సరికొత్త రికార్డు సృష్టించడం అతని ప్రతిభకు నిదర్శనం.
మోర్లె సాక్షి, ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ ఆదర్శ గిరిజన క్రీడా పాఠశాలకు చెందిన సాక్షి, కోచ్ విద్యాసాగర్ శిక్షణలో జావెలిన్‌లో మెలకువలు నేర్చుకుంది. అండర్-14 విభాగంలో బంగారు పతకం సాధించడమే కాకుండా, దక్షిణ భారత స్థాయి ఛాంపియన్‌షిప్‌లో 37.82 మీటర్లు విసిరి ఆ స్థాయిలోనే రికార్డు నెలకొల్పింది. తాజాగా హనుమకొండలో జరిగిన అండర్-16 పోటీల్లోనూ స్వర్ణం గెలిచి విజయపరంపరను కొనసాగిస్తోంది.
ఈ యువ క్రీడాకారుల విజయాలు, రాష్ట్రంలో జావెలిన్ త్రో క్రీడకు పెరుగుతున్న ఆదరణకు నిలువుటద్దం పడుతున్నాయి. సరైన ప్రోత్సాహం, శిక్షణ అందిస్తే, వీరిలో నుంచే భవిష్యత్ ‘నీరజ్ చోప్రా’లు ఉద్భవించడం ఖాయం.


