Telangana RTC electric bus conversion : ఒకవైపు పర్యావరణ పరిరక్షణ, మరోవైపు ఆర్థిక ఆదా.. ఈ రెండు లక్ష్యాలతో తెలంగాణ ఆర్టీసీ ఓ వినూత్న ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. కాలం చెల్లిన పాత డీజిల్ బస్సులకు కొత్త ఊపిరిపోసి, వాటిని విద్యుత్ బస్సులుగా మార్చాలని నిర్ణయించింది. అయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘స్క్రాప్ పాలసీ’ ఈ ప్రయత్నానికి పెద్ద అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో, 15 ఏళ్ల నిబంధనను తమకు మినహాయించాలని కోరుతూ ఆర్టీసీ, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఇప్పుడు అందరి దృష్టి దిల్లీపైనే ఉంది.
అసలు సమస్య ఎక్కడొచ్చిందంటే : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తుక్కు విధానం (స్క్రాప్ పాలసీ) ప్రకారం 15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాలను తప్పనిసరిగా స్క్రాప్‌కు తరలించాలి. కాలుష్యాన్ని తగ్గించడం, రహదారి భద్రతను పెంచడం దీని ముఖ్య ఉద్దేశం. అయితే, భారీ వ్యయంతో పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్‌గా మార్చిన తర్వాత, కేవలం 15 ఏళ్ల నిబంధన కారణంగా వాటిని తుక్కుగా అమ్మేయాల్సి వస్తే అసలుకే మోసం వస్తుందని ఆర్టీసీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అందుకే, ఈ నిబంధన నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది. భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందిన బస్సులను మాత్రమే ఎలక్ట్రిక్‌గా మారుస్తామని, లేనిపక్షంలో వాటిని స్క్రాప్ చేస్తామని ఆర్టీసీ ఇప్పటికే స్పష్టం చేసింది.
ఒక్క బస్సుతో ఏడాదికి రూ.10 లక్షల ఆదా : డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్‌గా మార్చడం వెనుక పటిష్ఠమైన ఆర్థిక, పర్యావరణ ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని నిరూపించేందుకు ఆర్టీసీ ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఓ బస్సును నడుపుతోంది. ఉప్పల్ డిపోకు చెందిన ఓ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు డీజిల్ ఇంజిన్‌ను తొలగించి, కన్వర్షన్ కిట్‌తో ఎలక్ట్రిక్ బస్సుగా మార్చారు. ఉప్పల్-మెహిదీపట్నం మధ్య రోజుకు 141 కిలోమీటర్లు తిరుగుతున్న ఈ బస్సుకు ఛార్జింగ్‌కు అవుతున్న ఖర్చు కేవలం రూ. 1,189. అదే డీజిల్‌తో నడిపితే అయ్యే ఖర్చుతో పోలిస్తే రోజుకు రూ.1,491 ఆదా అవుతోంది. ప్రస్తుతం డిపో వెలుపల ఛార్జింగ్ సదుపాయం లేనందున ఒక్క పూటే నడుపుతున్నారు. రెండు పూటలా నడిపితే, ఒక్క బస్సుపైనే ఏడాదికి రూ.10.88 లక్షలు ఆదా అవుతుందని అధికారులు లెక్కలు తేల్చారు. ఈ లెక్కన తొలి దశలో 200 బస్సులను మార్చాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది.
కేంద్రం ముందున్న ప్రత్యామ్నాయాలు : గతంలో హైదరాబాద్ కోసం 2,800 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు కావాలని ఆర్టీసీ కోరగా, కేంద్రం 2,000 బస్సులను మాత్రమే మంజూరు చేసింది. ఇప్పుడు ఆర్టీసీ రాసిన లేఖ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకటి, ఆర్టీసీ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని స్క్రాప్ పాలసీ నిబంధనను సడలించడం. రెండు, మిగిలిన 800 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేయడం. కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
కాలుష్య రహిత ప్రయాణం దిశగా : నగరాన్ని కాలుష్య రహితంగా మార్చే బృహత్తర లక్ష్యంలో భాగంగా ఆర్టీసీ ఇప్పటికే 775 ఎలక్ట్రిక్ బస్సులను నగర రోడ్లపై నడుపుతోంది. రానున్న మూడు నెలల్లో మరో 275 బస్సులు అందుబాటులోకి రానున్నాయి. 2027 నాటికి దశలవారీగా మరో రెండు వేలకు పైగా బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ ప్రణాళికలు రచిస్తోంది.


