Local Body Elections: లోకల్ బాడీ ఎలక్షన్ ప్రక్రియపై హై కోర్టు స్టే విధించడంతో అధికార పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడిన నేపథ్యంలో కచ్చితంగా ఎన్నికలు జరుగుతాయని అంతా భావించగా.. ఇప్పుడు అసలు ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో చెప్పలేని పరిస్థతి ఉత్పన్నమైంది. దీంతో కాంగ్రెస్ కింది స్థాయి కేడర్ అయోమయంలో పడిపోయింది. ఆయితే హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ పెద్దలు మాత్రం వెనక్కి తగ్గేలా కనిపిస్తలేదు. తప్పనిసరిగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చితీరాల్సిందేనని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.
వెనక్కి తగ్గేదేలే: అందుకే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. జీవో 9పై హైకోర్టు ఇచ్చిన స్టేను.. ఎత్తివేసి ఎన్నికల నిర్వహణకు అనుమతించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరనుంది. ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైనందున ఇందులో హైకోర్టు జోక్యం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించనున్నట్లుగా సమాచారం. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా జనాభా గణాంకాలపై సర్వే నిర్వహించే 57.6శాతం ఉన్న బీసీకు 42శాతం రిజర్వేషన్‌లు కల్పించామని సుప్రీంకోర్టుకు తెలపనున్నారు. బీసీలకు సామాజిక న్యాయం అందించేందుకై రిజర్వేషన్‌ల పరిమితిని సవరిస్తూ చట్టం తీసుకువచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లనుంది.
ఇంతవరకు అందని తీర్పు కాపీ: హైకోర్టు తీర్పు కాపీ ఇంతవరకు ప్రభుత్వానికి అందలేదు. ఆ తీర్పు పత్రం అందిన వెంటనే సుప్రీంకోర్టును ప్రభుత్వం ఆశ్రయించనుంది. హైకోర్టు తీర్పు కాపీ ఈ నెల 13వ తేదినాటికి అందవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ అది రాకపోయినా.. మినహాయింపు కోరుతూ అత్యవసరంగా స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరే అవకాశాలున్నాయి. మరోవైపు.. రిజర్వేషన్‌ల జీవో 9ను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన బి.మాధవరెడ్డి, మరొకరు సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్‌ను ఇప్పటికే దాఖలు చేశారు. అనగారిజర్వేషన్‌లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎవరైనా అప్పీలు దాఖలు చేస్తే.. తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని సుప్రీంకోర్టును వారు అభ్యర్థించారు.


