Sunday, November 16, 2025
HomeతెలంగాణConductor posts : పన్నెండేళ్ల నిరీక్షణకు తెర.. ఆర్టీసీలో కండక్టర్ల కొలువుల జాతర!

Conductor posts : పన్నెండేళ్ల నిరీక్షణకు తెర.. ఆర్టీసీలో కండక్టర్ల కొలువుల జాతర!

TGSRTC conductor recruitment 2025 : తెలంగాణలోని నిరుద్యోగులకు ఇది నిజంగా తీపి కబురు. దశాబ్దానికి పైగా మూగబోయిన కండక్టర్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) శ్రీకారం చుట్టింది. సుమారు 1,500 పోస్టులతో మెగా రిక్రూట్‌మెంట్‌కు సిద్ధమైంది. అసలు 12 ఏళ్లుగా ఈ నియామకాలు ఎందుకు ఆగిపోయాయి…? సంస్థలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులేంటి..? ప్రభుత్వ ఆమోదం లభిస్తే ఈ నియామక ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుంది..? 

- Advertisement -

ప్రభుత్వానికి ఆర్టీసీ ప్రతిపాదనలు: తెలంగాణ ఆర్టీసీలో ఏకంగా 1,500 కండక్టర్ పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతించాలని కోరుతూ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు పంపింది. 2013 తర్వాత సంస్థలో పూర్తిస్థాయిలో కండక్టర్ల నియామకం జరగకపోవడంతో, ఈ పరిణామం నిరుద్యోగ వర్గాల్లో కొత్త ఆశలను రేకెత్తించింది. ఏటా వందల సంఖ్యలో ఉద్యోగులు పదవీ విరమణ చేస్తుండటంతో సంస్థలో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది.

సిబ్బంది కొరత.. పెరిగిన పనిభారం: గణాంకాలను పరిశీలిస్తే, 2014-15లో ఆర్టీసీలో ఉద్యోగుల సంఖ్య 56,740గా ఉండగా, 2025 జూన్ నాటికి ఆ సంఖ్య 39,652కి పడిపోయింది. అంటే, దాదాపు 30 శాతానికి పైగా సిబ్బంది తగ్గారు. దీంతో ప్రస్తుతం విధుల్లో ఉన్నవారిపై పనిభారం విపరీతంగా పెరిగింది. ఈ సమస్యను అధిగమించడానికి ఆర్టీసీ యాజమాన్యం తాత్కాలిక కండక్టర్లను నియమించుకోవడం, కొన్ని రూట్లలో డ్రైవర్లకే కండక్టర్ బాధ్యతలు అప్పగించడం (వన్‌మ్యాన్ సర్వీసులు) వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిస్తోంది. దూరప్రాంత సర్వీసులకే పరిమితమైన ఈ విధానాన్ని ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ బస్సులకు కూడా విస్తరించింది. మరోవైపు, ‘మహాలక్ష్మి’ పథకం అమలుతో బస్సుల్లో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరగడం కండక్టర్లపై అదనపు భారం మోపుతోంది.

పాత నోటిఫికేషన్‌తో కలిపి భర్తీ చేస్తారా : ఇదిలా ఉండగా, ఆర్టీసీలో డ్రైవర్లు సహా 11 విభాగాల్లో కలిపి 3,035 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఏడాది క్రితమే సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. అయితే, కొన్ని సాంకేతిక కారణాలతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇప్పుడు కొత్తగా ప్రతిపాదించిన 1,500 కండక్టర్ పోస్టులను ఆ పాత నోటిఫికేషన్‌తో కలిపి భర్తీ చేస్తారా, లేక ప్రత్యేకంగా నియామకాలు చేపడతారా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఆర్టీసీలో ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గతంలోనే ప్రకటించిన నేపథ్యంలో, ప్రభుత్వ నిర్ణయం కోసం నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad