TR Nagar mini India : అనగనగా ఒక ఊరు.. అక్కడ తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, ఒడియా, హిందీ.. ఇలా పది రాష్ట్రాల భాషలు వినిపిస్తాయి. ఒకే వీధిలో గుడి, మసీదు, చర్చి, గురుద్వారా పక్కపక్కనే కనిపిస్తాయి. ఇదేదో పాఠ్యపుస్తకాల్లోని ‘భిన్నత్వంలో ఏకత్వం’ పాఠం కాదు, తెలంగాణ గడ్డపై ఆవిష్కృతమైన ఓ అద్భుత వాస్తవం. జగిత్యాల జిల్లాలోని ఓ చిన్న పల్లె, యావత్ భారతదేశానికి ప్రతీకగా నిలుస్తోంది. అసలు ఇన్ని రాష్ట్రాల ప్రజలు ఒకే చోటికి ఎలా చేరారు? పొట్టకూటి కోసం వచ్చిన వారు, ఒకే గూటి పక్షుల్లా ఎలా కలిసిపోయారు? ఆ ఊరి కథేంటి?
‘తారకరామ’ నగరంగా ఆవిర్భావం : ఈ కథ 1984లో ప్రారంభమైంది. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం, నిరుపేదలకు పక్కా ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో జగిత్యాల సమీపంలోని నర్సింగాపూర్ శివారులో ఓ గృహనిర్మాణ పథకాన్ని చేపట్టింది. అలా వెలసిన కాలనీయే నేటి టీఆర్ నగర్ (తారకరామనగర్). మొదట్లో వివిధ జిల్లాల నుంచి వలస వచ్చిన వారు ఇక్కడ ఆవాసం ఏర్పరచుకున్నారు. క్రమంగా దాని జనాభా పెరిగి, గ్రామ పంచాయతీగా, ఆ తర్వాత జగిత్యాల పురపాలక సంఘంలో విలీనమైంది.
భిన్నత్వానికి చిరునామా : ప్రస్తుతం రెండు వార్డులుగా ఉన్న ఈ టీఆర్ నగర్ జనాభా దాదాపు 9 వేలు. ఇక్కడ తెలంగాణలోని పాత పది జిల్లాల వారే కాకుండా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, దిల్లీ వంటి 10కి పైగా రాష్ట్రాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. దశాబ్దాల క్రితం వలస వచ్చిన వారి పిల్లలు, ఇక్కడే పుట్టి పెరిగి, ఈ ఊరినే తమ సొంత గడ్డగా భావిస్తున్నారు.
మతసామరస్యానికి ప్రతీక : ఈ గ్రామం సర్వమత సమ్మేళనానికి నిలువుటద్దం. హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు సోదరులంతా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటారు. గ్రామంలో నాలుగు దేవాలయాలు, మూడు మసీదులు, రెండు చర్చిలు, సిక్కుల కోసం ఒక గురుద్వారా కూడా ఉండటం ఇక్కడి సామరస్యానికి నిదర్శనం. ముస్లిం పిల్లల కోసం ప్రత్యేకంగా ఉర్దూ పాఠశాల, మదర్సా కూడా ఉన్నాయి.
వలసకు కారణం.. ఉపాధి మార్గం : ఇంతమంది ఒకేచోట స్థిరపడటానికి ప్రధాన కారణం ఉపాధి, అందుబాటు ధరల్లో నివాసం. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి వంటి పట్టణాలకు సమీపంలో ఉండటం, తక్కువ అద్దెకే ఇళ్లు దొరకడంతో పొట్టకూటి కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కూలీలు, చిరువ్యాపారులు ఇక్కడే స్థిరపడ్డారు. సమీపంలోని ఇటుక బట్టీలలో పనిచేస్తూ, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి, భాష, సంస్కృతి వేరైనా, మానవత్వపు భాగంతో అందరూ ఒక్కటిగా కలిసి జీవిస్తున్న ఈ టీఆర్ నగర్, నేటి సమాజానికి ఓ గొప్ప సందేశాన్ని ఇస్తోంది.


