Two-wheeler accident prevention : నిత్యం రద్దీగా ఉండే రహదారులపై ప్రయాణం ప్రాణాలతో చెలగాటంగా మారుతోంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారుల పాలిట మృత్యుఘోష వినిపిస్తోంది. చిన్నపాటి నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన నిండు ప్రాణాలను బలిగొంటోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న ప్రమాదాల్లో అధిక శాతం బైక్‌లవే కావడం ఆందోళన కలిగిస్తోంది. అసలు ఈ ప్రమాదాలకు కారణాలేంటి? హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఎంతటి అన్యాయం జరుగుతోంది? పోలీసుల గణాంకాలు ఏం చెబుతున్నాయి?
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 60 శాతం ద్విచక్ర వాహనాల వల్లే సంభవిస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మరీ ముఖ్యంగా, ఈ ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో దాదాపు 45 శాతం మంది హెల్మెట్ ధరించని వారే ఉండటం గమనార్హం. “తలరాతను మార్చే తలకవచం” ప్రాణాలకు రక్షణ కల్పిస్తుందని తెలిసినా, చాలామంది పెడచెవిన పెడుతున్నారు. పోలీసుల జరిమానాల నుంచి తప్పించుకోవడానికి నాసిరకం హెల్మెట్లు వాడటం, లేదా అసలే ధరించకపోవడం వంటి నిర్లక్ష్యపు ధోరణులు విలువైన ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి.
నిలువెత్తు విషాదాలు: నాసిరకం హెల్మెట్ బలి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం రాంపూర్‌కు చెందిన హుస్సేన్ (47) అనే మార్కెటింగ్ ఉద్యోగి, నాసిరకం హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలు కోల్పోయాడు. కామారెడ్డి నుంచి తిరిగి వెళ్తుండగా సదాశివనగర్ మండలం దగ్గి శివారులో భారీ వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో, హెల్మెట్ పగిలిపోయి తలకు తీవ్ర గాయాలవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
యువకుడి దుర్మరణం: వేల్పూర్ క్రాస్ రోడ్డు వద్ద రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో దినేష్ (26) అనే యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. గత మూడు నెలల్లో ఆర్మూర్, ఇందల్వాయి, వర్ని, డిచ్‌పల్లి, నందిపేట్ మండలాల్లోని గ్రామీణ రహదారులపై ఇలాంటి ఘటనలు పెరిగిపోయినట్లు పోలీసుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రహదారి భద్రతా నియమాలను పాటించకపోవడమే ఈ దుర్ఘటనలకు ప్రధాన కారణమని అధికారులు తేల్చిచెబుతున్నారు. సమీపిస్తున్న దసరా పండుగ నేపథ్యంలో యువత, విద్యార్థులు అతివేగంతో, అజాగ్రత్తగా వాహనాలు నడపకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని పోలీసులు హితవు పలుకుతున్నారు.
పోలీసులు చెబుతున్నది ఇదే: నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ మాట్లాడుతూ, “ద్విచక్ర వాహనదారులు ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసీ హెల్మెట్ ధరించకపోవడం, రాంగ్‌రూట్‌లో ప్రయాణించడం వంటివి చేస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహతో, బాధ్యతగా మెలగాలి,” అని సూచించారు.
వాహనదారులకు సూచనలు:
ప్రాణం కన్నా పైకం గొప్పదా?: హెల్మెట్ ధర ఎక్కువని ఆలోచించవద్దు. మీ ప్రాణాల కన్నా ఏదీ విలువైనది కాదు. నాణ్యమైన, ఐఎస్ఐ (ISI) ముద్ర ఉన్న హెల్మెట్‌నే ఎంచుకోవాలి.
నాసిరకం వద్దు: తక్కువ ధరకు లభించే నాసిరకం హెల్మెట్లు ప్రమాదాల నుంచి ఎలాంటి రక్షణ ఇవ్వలేవు. నాణ్యమైన దానికి, సాధారణ దానికి ధరలో పెద్ద వ్యత్యాసం ఉండదు.
రక్షణ మీ కోసమే: హెల్మెట్ పోలీసుల కోసం కాదు, మీ ప్రాణరక్షణ కోసం ధరించాలన్న విషయాన్ని గుర్తుంచుకోండి.
క్లిప్ తప్పనిసరి: హెల్మెట్‌ను తలకు పెట్టుకుని క్లిప్ పెట్టుకోకపోతే ప్రయోజనం శూన్యం. ప్రమాదం జరిగినప్పుడు అది తల నుంచి ఎగిరిపోయే ప్రమాదం ఉంది.
టోపీ కాదు, తలకవచం: కేవలం తనిఖీల నుంచి తప్పించుకోవడానికి టోపీ తరహా హెల్మెట్లు వాడటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు.


