Saturday, October 5, 2024
HomeతెలంగాణTCongress: వృద్ధ కాంగ్రెస్‌ను గాడిన పెట్టేందుకు వృద్ధుడినే పంపించారా?

TCongress: వృద్ధ కాంగ్రెస్‌ను గాడిన పెట్టేందుకు వృద్ధుడినే పంపించారా?

TCongress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంతకంతకు రోజు రోజుకీ దిగజారిపోవడంలో కీలకపాత్ర వృద్ధులదే. వాళ్ళ రాజకీయ జీవితమంతా పార్టీలో ఎన్నో పదవులను అనుభవించి.. అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా అధికారం చెలాయించారు. ఇప్పుడు యువ నాయకులొచ్చి వాళ్ళని కాస్త వెనక్కు నెడుతుంటే వాళ్ళకి ఎక్కడలేని రోషం తన్నుకొస్తోంది. నిన్నగాక మొన్నొచ్చిన బచ్చాగాళ్లు మా మీద పెత్తనం చెలాయిస్తారా అని గ్రూపులు కట్టి పార్టీలో చిచ్చు పెడుతున్నారు.

- Advertisement -

ఆ మాటకొస్తే ఒక్క తెలంగాణలోనే కాదు యావత్ దేశమంతా కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపు రాజకీయాలు.. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు. తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్రంలో పార్టీ బలంగా మారేందుకు అన్ని అవకాశాలు ఉన్నా.. పార్టీలో కుమ్ములాటలతో ప్రజలలో పార్టీని చులకనచేసి అదఃపాతాళానికి తొక్కేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ సారధిగా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత ఆయన ఎలాంటి మొహమాటాలు లేకుండా వృద్ధ నేతలందరి ఇళ్ల చుట్టూ తిరిగారు. కాస్త కలిసినట్లే కనిపించినా అవసరమైన ప్రతిసారి అదే కుమ్ములాటలు.. అదే అసంతృప్తితో పార్టీని ఇంకా ఇంకా తొక్కేస్తూ వస్తున్నారు.

తాజాగా పార్టీలో పదవుల పంపకం విషయంలో రేవంత్ రెడ్డిపై సీనియర్ నేతలు బహిరంగంగా తిరుగుబాటు చేయడం, పీసీసీకి రాజీనామాలు చేయడంతో హైకమాండ్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. పార్టీ సీనియర్ నేతలతో మాట్లాడి సంక్షోభాన్ని పరిష్కరించేందుకు.. పార్టీ సీనియర్ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ను తెలంగాణకు పంపనున్నట్లు తెలుస్తుంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరగబోతుందన్నది ఆసక్తిగా మారింది.

ఎందుకంటే దిగ్విజయ్ ఎప్పుడూ యువ నేతలను ప్రోత్సహించలేదు.. ఇంకా చెప్పాలంటే డిగ్గీరాజాకు యువనేతలంటేనే నచ్చదు. ఎక్కడ ఆయన రంగంలోకి దిగినా సీనియర్ వృద్ధ నేతలకే పెద్దపీట వేస్తూ వచ్చారు. దీంతో ఇప్పుడు తెలంగాణపై ఆయన రిపోర్టు కూడా సీనియర్లకు అనుకూలంగా రేవంత్ కి వ్యతిరేకంగా వెళ్తే ఏంటి పరిస్థితి అన్నది చర్చకు దారితీస్తుంది. ఒకవేళ వృద్దులకు అనుకూలంగా దిగ్విజయ్ రిపోర్టు వెళ్తే చివరికి రేవంత్ పదవికే ఎసరు రావచ్చనే ప్రచారం కూడా అప్పుడే మొదలైపోయింది. మరి డిగ్గీ వస్తే ఏం చేస్తారు.. కాంగ్రెస్ పార్టీ తదుపరి కార్యక్రమాలు ఎలా ఉంటాయన్నది చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News