Today Rain in tg: రాష్ట్రంలో మాన్ సూన్ వర్షాలకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. అయితే ఉత్తర, పశ్చిమ, తూర్పు తెలంగాణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం నుంచి రాత్రి సమయంలో చెల్లాచెదురుగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మిగతా చాలా ప్రాంతాల వరకు… వేడిగా, తేమగా ఉంటుందన్నారు. ఇక హైదరాబాద్ లో కూడా సాయంత్రం నుంచి రాత్రి సమయంలో స్వల్ప వర్షం పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేశారు. మళ్ళీ జూలై 15 లేదా 16 తర్వాతే చురుకైన వర్షాలు ఉండే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. జూలై 30 వరకు సుదీర్ఘమైన భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
వాతావరణంలో మళ్ళీ వేడిమి పెరుగుదల వల్ల భారీ వర్షాలేమీ ఉండవు కానీ అక్కడక్కడా తేలికపాటి వర్షాలు మాత్రమే కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది జూలై 15 వరకు కొనసాగుతుందని పేర్కొంది.
గడిచిన 24 గంటల్లో:
గడిచిన 24 గంటల్లో.. మహబూబాబాద్, నల్గొండ, జనగాం, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ లలో స్వల్ప వర్షాలు కురిసాయి. హైదరాబాద్ లో సాయంకాలం పూట చిరుజల్లులు కురిసాయి. నిన్నటిలాగే ఈరోజు కూడా రుతుపవనాలు మందకొడిగా ఉంటాయని పేర్కొన్నారు. అనేక ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు లేదా పొడి వర్షాలు మాత్రమే ఉంటాయని చెప్పారు.
తెలంగాణలో జూన్ మొదటి వారంలోనే రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ, వాటి ప్రభావం అంతగా లేదు. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు రుతుపవనాలు చురుకుగా మారడానికి అనుకూలంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తరించి, రైతాంగానికి ఉపశమనం కలిగించే అవకాశం ఉంటుందని ఇప్పటికే వాతావరణ కేంద్రం తెలిపింది.


