Kavitha and BJP: రాజకీయ ఎదుగుదల కోసం ఇతర పార్టీల నేతలను తమ వైపు తిప్పుకోవడంలో బీజేపీది ప్రత్యేక శైలి. ఏ పార్టీతో విభేదించినా, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నా సరే, బలమైన నాయకులను తమ గూటికి చేర్చుకోవడానికి బీజేపీ వెనుకాడదనేది దేశవ్యాప్తంగా ఎన్నో సందర్భాల్లో నిరూపితమైంది. ఇప్పుడు బీఆర్ఎస్ నుండి సస్పెండ్ అయిన కల్వకుంట్ల కవిత విషయంలో బీజేపీ ఇదే సంప్రదాయాన్ని అనుసరిస్తుందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, అవినీతిపరులను బీజేపీలో అడుగు పెట్టనివ్వబోమని, అది కవిత అయినా సరే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో పాటు ఆ పార్టీ నాయకులంతా వ్యాఖ్యానించినా.. అధిష్టానం మాత్రం వేరేగా ఆలోచించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.
2014 నుండి ఇప్పటి వరకు హిమంత బిశ్వ శర్మ, అశోక్ చవాన్, ప్రఫుల్ పటేల్, అజిత్ పవార్, ముకుల్ రాయ్, సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటివారిపై అవినీతి ఆరోపణలు ఉన్నా కూడా కాషాయ పార్టీలో చేర్చుకున్నారు. అయితే ఈ నాయకులందరూ బీజేపీలో చేరిన తర్వాత వారిపై ఉన్న కేసుల విచారణలు మందగించడం, కొందరికి క్లీన్ చిట్ లభించింది. కాగా ఇప్పుడు కవిత విషయంలో కూడా కాషాయ అధిష్టానం ఉహించని ప్లాన్ చేసినా.. ఆశ్చర్యపోనక్కర్లేదని చర్చ జరుగుతోంది. కూతురును చేర్చుకొని తండ్రి కేసీఆర్‌ను ఢీకొట్టేందుకు వ్యూహారచన చేసినా పార్టీకి కలిసొస్తుందని విశ్లేషిస్తున్నారు.
బీజేపీ వ్యూహంలో కవిత ప్రత్యేకం..
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ఎప్పటి నుండో తమ వ్యూహాన్ని నెమ్మదిగా అమలు చేసుకుంటూ వస్తుంది. ఈ క్రమంలోనే 2014 నుండి రోజురోజుకు రాష్ట్రంలో బీజేపీ ఓటు షేరింగ్ పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే బీజేపీ తన రాజకీయ విస్తరణ కోసం ‘ఆపరేషన్ ఆకర్ష్’ను సమర్థవంతంగా అమలు చేస్తోంది. పార్టీ విధానాలు నచ్చకో, ప్రాధాన్యం లేకనో అసంతృప్తితో ఉన్న నేతలను, సొంత కుటుంబ సభ్యులతో విభేదించిన వారిని తమ వైపు తిప్పుకొని స్థానికంగా బలోపేతం కావడం బీజేపీ ప్రధాన వ్యూహం. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెలంగాణ రాష్ట్రం ఏమీ మినహాయింపు కాదనే చెప్పవచ్చు. గతంలో బీఆర్ఎస్‌తో విభేదించిన ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర రెడ్డి, గోడెం నాగేష్, సీతారాం నాయక్, శానంపూడి సైదిరెడ్డి, గువ్వల బాలరాజు, రాథోడ్ బాపురావు, పోతుగంటి రాములు, జలగం వెంకట్రావు, బీబీ పాటిల్ వంటి ఎందరో నాయకులను బీజేపీ తమ వైపు తిప్పుకుంది. వీరిలో కొందరు ఎంపీలుగా గెలిచారు, ఇంకొందరు గత అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగారు, మరికొందరు ఇటీవల పార్టీలో చేరారు. ఇలా ఇప్పటికే కేసీఆర్‌తో విభేదించిన అనేక మంది బీఆర్ఎస్ నేతలను బీజేపీ తమ వైపు తిప్పుకుంది. మరి, కల్వకుంట్ల కవిత విషయంలో బీజేపీ ఇదే సంప్రదాయాన్ని అనుసరిస్తుందా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత ఈడీ కస్టడీలో ఉండటం, ఆమె పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో, బీజేపీ ఆమెను తమ పార్టీలో చేర్చుకుంటుందా అన్నది ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత ప్రమేయం, బీఆర్ఎస్‌తో విభేదించి పార్టీకి, ఎమ్మెల్సీకి రాజీనామా చేసిన కల్వకుంట్ల కవితను కూడా బీజేపీ తన వైపు తిప్పుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ ను బలహీనపరచడం, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగడం అనే లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని కవితను తమ పార్టీలో చేర్చుకుంటారని ప్రచారం జరుగుతుంది. అయితే కవిత బీజేపీలో చేరితే, అది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తుందని అంచనా వేస్తున్నారని సమాచారం.


