Bihar Waterfall Viral Video: వరుణుడు ఉత్తరాదిని వణికిస్తున్నాడు. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్‌తోపాటు ఈశాన్య రాష్ట్రాలల్లో సైతం కుండపోత వర్షాలు కుమ్మేస్తున్నాయి. నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ భారీవర్షాల నేపథ్యంలో ఓ వైరల్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. పర్యాటకులు జలపాతం వద్ద సేదతీరుతున్న సమయంలో అనూహ్యంగా నీటి ప్రవాహం పెరిగి వారు కొట్టుకుపోయిన ఘటన నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
బిహార్‌లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వానలకు నదులు, జలపాతాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో కొంత మంది పర్యాటకులు గయాజీలో కొండపై ఉన్న వాటర్ ఫాల్ దగ్గరకు సేదతీరేందుకు వెళ్లారు. నీటిమట్టం తక్కువగా ఉండటంతో వారంతా అందులో జలక్రీడలు ఆడారు. ఇంతలో అనూహ్యంగా వరద ప్రవాహం పెరిగింది. వాళ్లు ఒడ్డుకు చేరే అవకాశం కూడా ఇవ్వకుండా వరద చుట్టుముట్టేసింది. కొందరు తప్పించుకోగా.. మరికొంత మంది రాళ్లను పట్టుకుని కాపాడమంటూ ఆర్తనాదాలు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.
మరోవైపు దేవభూమి ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడి పలువురు మృత్యువాతపడ్డారు. హిమాలచల్ ప్రదేశ్‌లోనూ జోరుగా వానలు పడుతున్నాయి. రాజధాని సిమ్లాలో అయితే ఓ ఐదంతస్థుల బిల్డింగ్ కూలిపోయింది. భవనాన్ని ముందుగానే అందరూ ఖాళీ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. మండిలో బియాస్ నది ఉగ్రరూపం దాల్చింది. ఈ భారీ వర్షాలకు గత పది రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 20 మంది మృత్యువాతపడ్డారు. ఝార్ఖండ్‌లోనూ వర్షాలు అధికంగా కురుస్తున్నాయి.
దక్షిణాదిలోనూ వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ముఖ్యంగా కర్ణాటకలో భారీ వర్షాలు కుదుపేస్తున్నాయి. ఈ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వాగులు, వంకలు, నదులు ఓ రేంజ్ లో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఓ మోస్తరు వానలు పడుతున్నాయి. రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


