Bihar incident: బీహార్‌లోని పూర్నియా జిల్లాలో ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది. 24 ఏళ్ల బీబీ హసెరున్ అనే మహిళ ఒకే కాన్పులో నలుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఆమెకు ఇది నాలుగో ప్రసవం కాగా, గతంలో ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇప్పుడు ఈ నలుగురితో కలిపి ఆమెకు మొత్తం ఎనిమిది మంది పిల్లలు.
ప్రసవ నొప్పులతో బీబీ హసెరున్‌ను బైసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. ఆరోగ్య కార్యకర్తలు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయగా, అందులో ముగ్గురు శిశువులు ఉన్నట్లు తేలింది. అరుదుగా జరిగే ఈ ఘటనను చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. ఆసుపత్రిలోని వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఆమెకు ధైర్యం చెప్పి సాధారణ ప్రసవానికి సిద్ధం చేశారు.
ప్రసవ సమయంలో మొదట ముగ్గురు ఆడపిల్లలు జన్మించారు. అయితే, కొద్దిసేపటి తర్వాత గర్భాశయంలో మరొక శిశువు కదలిక కనిపించింది. అల్ట్రాసౌండ్ రిపోర్ట్‌లో కనిపించని ఆ నాలుగో శిశువును కూడా వైద్యులు అదనపు జాగ్రత్తలు తీసుకుని సురక్షితంగా బయటకు తీశారు. ప్రసవం తర్వాత తల్లి, నలుగురు ఆడపిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించారు.
ఈ వార్త స్థానికంగా వేగంగా వ్యాపించడంతో, ఆ శిశువులను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం, మెరుగైన వైద్య పర్యవేక్షణ కోసం తల్లీ బిడ్డలను పూర్ణియా మెడికల్ కాలేజీకి తరలించారు. సాధారణ ప్రసవం ద్వారా నలుగురు ఆరోగ్యకరమైన పిల్లలు జన్మించడం చాలా అరుదని వైద్య నిపుణులు తెలిపారు. ఇలాంటి సందర్భాలలో పిల్లలు బతికే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ, ఈ కేసు ఆశ, ధైర్యానికి ఒక ఉదాహరణగా నిలిచిందని వారు ప్రశంసించారు. ఆమె భర్త కైజర్ ఆలం మాట్లాడుతూ, ఆశా కార్యకర్త సహాయంతో తన భార్యను సకాలంలో ఆసుపత్రికి తీసుకురావడంతో ప్రసవం విజయవంతమైందని తెలిపారు.


