అనుమానాస్పదంగా మృతి చెందిన విద్యార్థి అభిలాష్ ది హత్యో.. ఆత్మహత్యో.. వెంటనే తేల్చాలనీ, అన్ని కోణాల్లో విచారణ జరిపి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కరీంనగర్ పోలీసులను ఆదేశించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన అభిలాష్ అనే విద్యార్థి గత నెల 1వ తేదీన అదృశ్యమై 27న బావిలో శవమై తేలిన విషయం తెలిసిందే. కాగా విద్యార్థి మృతి అనుమానాస్పదంగా ఉండడంతో అతని తల్లిదండ్రులు ఎల్ఎండీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బావిలో విద్యార్థి మొండెం మాత్రమే దొరకగా తలభాగం ఆచూకీ కనబడకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర మనోవేదన చెందుతున్నారు. దాదాపు వారం రోజులుగా బావి వద్దే ఉంటూ తల కోసం వెతుకుతున్నారు. కాగా సోమవారం సాయంత్రం మంత్రి శ్రీధర్ బాబు ఘటనాస్థలికి చేరుకొని, మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. విద్యార్థి హత్యో.. ఆత్మహత్యో.. వెంటనే తేల్చాలని పోలీసులను ఆదేశించారు.
నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది..
విద్యార్థి మృతిపై కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. విద్యార్థి మృతిపై కళాశాల యాజమాన్యం స్పందించకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. విద్యార్థుల బాగోగులు చూసుకోవాల్సిన కళాశాల యాజమాన్యం మృతిపై స్పందించకపోవడం విచారకరమని పేర్కొన్నారు.