బీఆర్ఎస్ పార్టీకి ఇక మిగిలింది ఇలాంటి షాకులే అన్న విషయం ఓపన్ సీక్రెట్ గా మారిన ప్రస్తుత తరుణంలో రోజురోజుకీ గులాబీ గూటికి గుడ్ బై కొట్టేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కింది క్యాడర్ మొదలు సీనియర్ నేతల వరకు పార్టీని వీడేవారు కాంగ్రెస్ కండువా కప్పుకోవడంలో పోటీపడుతున్నారు.
తాజాగా సీనియర్ నేత, నల్గొండ బీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. దీంతో నల్గొండలో కాంగ్రెస్ కు తిరిగు లేకుండా పోవటం ఖాయమని ఇక జగదీష్ రెడ్డి మాత్రమే బీఆర్ఎస్ లో మిగులుతారని నల్గొండ జిల్లా రాజకీయాలపై జోరుగా చర్చ సాగుతోంది.
గత కొంతకాలంగా అమిత్ కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం సాగుతోంది. ఈ ఊహాగానాలకు బలం చేకూర్చుతూ సీఎం రేవంత్ సన్నిహితుడు, సలహాదారుడైన వేం నరేందర్ రెడ్డిని కలిసి భేటీ కూడా వేసిన అమిత్ ఏ క్షణమైనా పార్టీ మారటం ఖాయంగా మారిందనే టాక్ వినిపించగా ఆయన తన సన్నిహితులతో కలిసి దీపా దాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇక మిగిలింది గుత్తా సుఖేందర్ రెడ్డి అని, ఆయన కూడా త్వరలో పార్టీ మారటం ఖాయంగా మరింది. ఇప్పటికే జగదీష్ రెడ్డి పోరు భరించలేక జిల్లా బీఆర్ఎస్ లో ఆయన తలనొప్పులు ఎదుర్కొంటుండగా, తన కొడుక్కి కేసీఆర్ టికెట్ ఇవ్వలేదనే అక్కసుతో ఏకంగా గులాబీ బాస్ పైనే ఈమధ్య ప్రెస్ మీట్ పెట్టారు గుత్తా. అప్పుడే ఆయన పార్టీ మారటం ఖాయమనే టాక్ కు మరింత ఊతం వచ్చింది. ప్రస్తుతానికి కేవలం గుత్తా తనయుడే కాంగ్రెస్ లో చేరగా అతి త్వరలో గుత్తా కూడా తన పాత గూటికి వచ్చి వాలతారనే గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.
గుత్తాకు పార్టీ మారటం పెద్ద సంగతేం కాదు. తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ గోడ మీద పిల్లిలా పార్టీలు మారిన చరిత్ర గుత్తాది. రాష్ట్రంలోని పార్టీలన్నింట్లో పనిచేసిన ఆయన తన రాజకీయ జీవితం చరమాంకంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీకే రావటం ఖాయమన్నమాట.