Sunday, June 30, 2024
Homeఆంధ్రప్రదేశ్A tribute to Ramoji Rao: సంస్మ‌ర‌ణ స‌భ‌లో రామోజీరావును కొనియాడిన ప్ర‌ముఖులు

A tribute to Ramoji Rao: సంస్మ‌ర‌ణ స‌భ‌లో రామోజీరావును కొనియాడిన ప్ర‌ముఖులు

రామోజీకు భారతరత్న సాధించడం మనందరి బాధ్యత

నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేసిన వ్యక్తి.. రామోజీరావు. ఆయ‌న స్థాపించిన వ్యవస్థ.. ఆ కుటుంబానిదే కాదు.. పది కోట్ల మంది ప్రజలది. రామోజీరావుకు భారతరత్న సాధించడం మనందరి బాధ్యత… అని సీఎం చంద్ర‌బాబునాయుడు పేర్కొన్నారు. విజ‌య‌వాడ కానూరులో గురువారం ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మ‌ర‌ణ స‌భ‌లో ఆయ‌న మాట్లాడారు. అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తాం. ఒక రోడ్డుకు ఆయ‌న పేరు పెడతాం. విశాఖలో చిత్రనగరికి రామోజీరావు పేరు పెడతాం.. అని చెప్పారు. పత్రికలో అన్ని పార్టీల నేతలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. నమ్మిన సిద్ధాంతాల‌కు క‌ట్టుబ‌డి నిరంత‌రం పనిచేసిన వ్యక్తి. పనిచేస్తూనే మరణించాలనే ఆయన కోరిక నెరవేరింది. తెలుగుభాష అంటే రామోజీరావుకు ఎనలేని అభిమానం. తెలుగుజాతి గొప్పగా ఉండాలని ఎప్పుడూ ఆకాంక్షించేవారు… అని సీఎం చంద్ర‌బాబు పేర్కొన్నారు. ఎందరో నటులు, జర్నలిస్టులు, కళాకారులకు జీవితం ఇచ్చార‌ని చెప్పారు. జిల్లా సంచిక‌లు తెచ్చి క్షేత్రస్థాయి ప్రజాసమస్యలు ప్రస్తావించార‌ని, ఈనాడు పత్రిక ద్వారా సమాజ హితం కోసం కృషి చేశార‌ని ఆయ‌న కొనియాడారు. ఎన్ని కష్టాలు వచ్చినా భయపడలేద‌ని, వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నార‌ని చెప్పారు రాజధానికి అమరావతి పేరు పెట్టాలని సూచించార‌ని, తెలుగుజాతి ఉజ్వల భవిష్యత్తుకు అమరావతి నాంది పలుకుతుంద‌ని సీఎం చంద్ర‌బాబు వెల్ల‌డించారు.

- Advertisement -

అమరావతిలో రామోజీరావు విగ్రహం నిర్మించాలి: డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌

ప్రజాసమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేశార‌ని డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు. రామోజీరావు మాట్లాడే విధానం నన్ను చాలా ఆకర్షించింది. ప్రజాసంక్షేమం కోణంలోనే ఆయన ఎప్పుడూ మాట్లాడేవారు. ఆయ‌న మాటల్లో జర్నలిజం విలువలే నాకు కనిపించాయి. పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరమో వివరించారు.. అని చెప్పారు. అమరావతిలో రామోజీరావు విగ్రహం నిర్మించాల‌ని డిప్యూటీ సీఎం ప‌వ‌న్ అభిల‌షించారు. అమరావతి కోసం రూ.10 కోట్లు విరాళాన్ని ఈనాడు ఎండీ కిర‌ణ్ ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ సంస్మరణ సభ నిర్వహించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. ప్ర‌జా స్వామ్య విలువల పరిరక్షణకు ఎప్పుడూ పరితపించేవారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అండగా నిలబడేవారు. ఎక్కడ విపత్తులు వచ్చినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉండేవారు. నాన్నగారి స్ఫూర్తితో ప్రజాసంక్షేమం కోసం కట్టుబడి ఉంటామని మాటిస్తున్నాం. అమరావతి దేశంలోనే గొప్ప నగరంగా మారాలి…అని ఈనాడు ఎండీ కిర‌ణ్ పేర్కొన్నారు. రామోజీరావు పత్రిక ద్వారా సమాజంలో అనేక మార్పులు తీసుకువ‌చ్చార‌ని మంత్రి పార్థసారథి చెప్పారు. అడుగుపెట్టిన ప్రతి రంగంలో ఎవరెస్టు శిఖరంలా ఎత్తుకు ఎదిగార‌న్నారు. రామోజీరావు నమ్మిన విలువల కోసం కట్టుబడేవార‌ని, పరువు నష్టం బిల్లుపై ఎడిటర్స్‌ గిల్డ్‌ అధ్యక్షుడిగా పోరాడార‌ని, ఆయ‌న పోరాటం ఫలితంగా ఆ బిల్లును వెనక్కి తీసుకున్నార‌ని ఎన్‌.రామ్ వివ‌రించారు. రామోజీరావు ప్రజల సమస్యలపై కలం కదిలించార‌ని, సమాజంలో అనేక రంగాల్లో తనదైన ముద్ర వేశార‌ని గులాబ్ కొఠారి పేర్కొన్నారు. కృషి, దీక్ష, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించార‌ని సినీ న‌టుడు మురళీమోహన్ చెప్పారు. రామోజీరావుకు భారతరత్న ఇవ్వడం సముచితం, సబబు అని సినీ డైరెక్ట‌ర్‌ రాజమౌళి చెప్పారు. మా దేవుడి గదిలో రామోజీరావు గారి ఫొటో ఉంటుంద‌ని, సంగీత దర్శకుడిగా త‌న‌కు జన్మ ఇచ్చార‌ని కీర‌వాణీ చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు సినీ, రాజ‌కీయ‌, పాత్రికేయ ప్ర‌ముఖులు మాట్లాడుతూ రామోజీరావు స‌మాజానికి అందించిన సేవ‌ల‌ను కొనియాడారు. ఆయ‌న‌తో త‌మ‌కు గ‌ల అనుబంధాన్ని పంచుకున్నారు. హాజ‌రైన ప్ర‌తి ఒక్క‌రూ రామోజీరావుకు ఘ‌న నివాళి అర్పించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News