Free Bus : ఆంధ్రప్రదేశ్‌లో మహిళల కోసం ప్రవేశపెట్టిన ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం పది రోజుల్లోనే విజయవంతమైంది. ఈ పథకంపై ప్రజల నుంచి వస్తున్న సానుకూల స్పందనపై సీఎం చంద్రబాబు నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. పథకం అమలు తీరు, లోటుపాట్లపై అధికారులతో ఆయన కీలక సమీక్ష నిర్వహించారు.
‘స్త్రీ శక్తి’కి పెరిగిన ప్రజాదరణ
ఆగస్టు 15న ప్రారంభమైన ఈ పథకం కింద రోజుకు సగటున 21 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. పథకం అమలుకు ముందు ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య 40% ఉండగా, ఇప్పుడు అది ఏకంగా 65% కి పెరిగిందని అధికారులు సీఎంకు వివరించారు. ఈ పథకంతో బస్సుల్లో ‘ఆక్యుపెన్సీ రేషియో’ గణనీయంగా పెరిగిందని, రాష్ట్రంలోని 60 డిపోల పరిధిలో తిరిగే బస్సుల్లో 100% ఆక్యుపెన్సీ నమోదవుతోందని అధికారులు తెలిపారు.
సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు.’స్త్రీ శక్తి’ పథకం కింద నడిచే 8,458 బస్సులకు ముందు, వెనుక స్పష్టంగా కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. బస్సుల్లో సీట్ల కోసం మహిళలు పోటీ పడినప్పుడు ఆర్టీసీ సిబ్బంది సంయమనంతో వ్యవహరించి, పరిస్థితిని చక్కదిద్దాలని సూచించారు.
Pawan Kalyan: హామీలను నిలబెట్టుకోలేకపోతున్న పవన్ కల్యాణ్
ప్రయాణికుల సౌలభ్యం కోసం బస్సుల్లో ‘లైవ్ ట్రాకింగ్’ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ విధానం వల్ల బస్సుల రాక కోసం వేచి చూడకుండా, ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు. పైలట్ ప్రాజెక్ట్‌గా గుంటూరు డిపోలోని బస్సుల్లో ఈ వ్యవస్థను ప్రవేశపెట్టి, ఆ తర్వాత రాష్ట్రమంతటా విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు. ‘స్త్రీ శక్తి’ పథకం కేవలం పది రోజుల్లోనే మహిళల జీవితాలపై సానుకూల ప్రభావం చూపిందని, ఇది ప్రభుత్వానికి పెద్ద విజయం అని చెప్పవచ్చు. ఈ పథకం మరింత విజయవంతం అయ్యేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తోంది.


