ఏపీలో కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ ఫైబర్ నెట్(AP Fibernet)లో గత వైసీపీ ప్రభుత్వం నియమించిన 410 ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. మరో 200 మంది ఉద్యోగులకు లీగల్ నోటీసులు ఇవ్వనుంది.
ఈ సందర్భంగా ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి(GV Reddy) మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో నియమించిన 410 మంది ఉద్యోగలుకు అపాయింట్మెంట్ లెటర్లు లేవని.. అందుకే వారిని ఉద్యోగాల నుంచి తొలగించామన్నారు. ఇంకో 200 మంది ఉద్యోగుల నియామక పత్రాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. అనంతరం వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. వైసీపీ నేతల ఇంట్లో వంట మనుషులు, డ్రైవర్లుగా చేసిన వారికి ఫైబర్ నెట్ సంస్థలో ఉద్యోగాలు ఇచ్చినట్టు ఆరోపించారు. ఇందుకోసం కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు.
ఇక వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ’Ram Gopal Varma)కు రూ.కోటి 15 లక్షలు అక్రమంగా ఫైబర్ నెట్ ద్వారా చెల్లించారని తెలిపారు. ఆ డబ్బులు వర్మ తిరిగి చెల్లించాలని.. చెల్లించకపోతే కేసు పెడతామని హెచ్చరించారు. ఇంటర్నెట్, కేబుల్ సర్వీసులను అత్యంత చౌక ధరకు ఇవ్వాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఫైబర్ నెట్ ప్రారంభించినట్టు ఆయన తెలిపారు. 2019లో 10లక్షలు కనెక్షన్లు ఉన్న ఫైబర్ నెట్ 2024 నాటికి 5 లక్షలకు పడిపోయిందని తెలిపారు.