రాష్ట్రంలోని మైనార్టీలకు ఇచ్చిన హామీలను ప్రణాళికా బద్ధంగా అమలుకు చర్యలు చేపడుతూ మైనార్టీల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు.
10,000 మందికి
రాష్ట్రంలోని 5000 మంది ఇమాములు, 5000 మంది మౌజనులకు లబ్ధి చేకూరుస్తూ గత ప్రభుత్వం నిలిపివేసిన గౌరవ వేతనాలను చెల్లించేందుకు ప్రభుత్వం రూ. 45 కోట్లు విడుదల చేయడంపై సీఎం చంద్రబాబుకు మంత్రి ఫరూక్ కృతజ్ఞతలు తెలుపుతూ మంగళవారం అమరావతిలో ఒక ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వ హయాంలో మైనార్టీల సంక్షేమాన్ని పూర్తిగా అణగదొక్కే ప్రయత్నం చేశారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేసేందుకు అన్ని చర్యలకు శ్రీకారం చుట్టామన్నారు. ఇమాములకు, మౌజాన్లకు గౌరవ వేతనం చెల్లింపుకు టిడిపి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు శ్రీకారం చుట్టారని, అయితే వైసిపి ప్రభుత్వ హయాంలో ఒక పక్క చెల్లింపుల్లో జాప్యం, మరోపక్క నెలల తరబడి చెల్లింపులు నిలిపివేశారని అన్నారు.
ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు
ఎన్నికలకు ముందు తాము ఎదుర్కొంటున్న సమస్యను ఇమాములు, మౌజాన్లు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. అప్పట్లో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ఆ హామీని నెరవేర్చేందుకు రూ. 45 కోట్లు విడుదల చేసి 6 నెలలకు సంబంధించిన జీతాల చెల్లింపుకు నిధులు విడుదల చేయడం పట్ల సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రాష్ట్రంలో రంజాన్ ఏర్పాట్లకు సంబంధించి కూడా ఉపవాస రోజుల్లో మసీదులు, దర్గాలు ఈద్గాలలో అన్ని ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖలకు ఇప్పటికే ఆదేశించినట్లు మంత్రి ఫరూక్ పేర్కొన్నారు.