AP Govt Offers Subsidies to Dairy Farmers: ఆంధ్రప్రదేశ్‌లో పాడి రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోన్న సంగతి తెలిసిందే. పశుపోషణను ప్రోత్సహించేందుకు పలు రాయితీ పథకాలను అమలు చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇందులో భాగంగా, రైతులకు గడ్డి విత్తనాలు, పశువుల దాణా, వ్యాక్సిన్లను రాయితీ ధరలకు అందిస్తోంది.
ఈ క్రమంలోనే 75 శాతం రాయితీతో గడ్డి విత్తనాలు పంపిణీ చేస్తోంది. దీంతో సాధారణంగా రూ.465 విలువ చేసే 5 కిలోల గడ్డి విత్తనాల సంచిని రైతులు కేవలం రూ.115కే పొందవచ్చు. అదే విధంగా, పశువుల దాణాను కూడా 50 శాతం రాయితీపై అందిస్తోంది.
ఈ రాయితీలను పొందాలంటే అర్హత ఉన్న రైతులు తమ సమీపంలోని పశువుల ఆస్పత్రులు లేదా రైతు సేవా కేంద్రాల్లో ఉన్న అధికారులను సంప్రదించాలి. రైతులు తమ ఆధార్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్సులతో అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. రాయితీల కోసం పశువుల ఆస్పత్రులలో అయితే ఆస్పత్రి వైద్యులను, రైతు సేవా కేంద్రాలలో ఏహెచ్‌ఏలను సంప్రదించాల్సి ఉంటుంది.
ఇక త్వరలోనే ప్రభుత్వం గడ్డి కోత యంత్రాలను కూడా రాయితీపై అందించేందుకు సన్నద్ధమవుతోంది. దీనివల్ల రైతులపై వ్యయభారం తగ్గి, పశుపోషణ మరింత సులభతరం కానుంది.


