ఏపీలో నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు(Inter Exams) ప్రారంభమయ్యాయి. తొలి రోజు మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం కాగా.. సోమవారం నుంచి రెండో సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం రాకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
మార్చి 20 వరకు జరిగే ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 1,535 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఇందులో 68 కేంద్రాలను సున్నిత, 36 కేంద్రాలను అతి సున్నితమైనవిగా గుర్తించారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇక 10,58,893 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. అందులో మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు 5,00,963 మంది, ఒకేషనల్ విద్యార్థులు 44,581 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. రెండో సంవత్సరం జనరల్ విద్యార్థులు 4,71,021 మంది, ఒకేషనల్ విద్యార్థులు 42,328 మంది ఉన్నారు.