Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్AP seasonal diseases: వ్యాధుల నిరోధానికి బృహత్ పథకం

AP seasonal diseases: వ్యాధుల నిరోధానికి బృహత్ పథకం

అంటువ్యాధులపై ముందు జాగ్రత్తలు

వర్షాకాలం సందర్భంగా రాష్ట్రంలో వ్యాధులను, అంటు రోగాలను నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. వ్యాధుల నిరోధానికి ఇప్పటికే ఆరోగ్య, వైద్య శాఖకు చెందిన అధికారులు వివిధ జిల్లాలలో పర్యటించడం ప్రారంభం అయింది. అంటు రోగాలు, తరుణ వ్యాధుల నిరోధానికి చేపడుతున్న
చర్యల్లో భాగంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు మత్స్య శాఖ సుమారు కోటి గంబూసా చేపలను (దోమ చేపలను) చెరువుల్లో, కాలువల్లో వదలడం జరిగింది. ఈ దోమల చేపల వల్ల చెరువులు, కాలువల్లో లార్వాల నిరోధం జరుగుతుంది. ఫలితంగా అంటురోగాల నివారణ జరుగుతుంది. ముఖ్యంగా ఈ విషయంలో ప్రభుత్వం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా వంటి ‘హై రిస్క్’ ప్రాంతాల మీద దృష్టి కేంద్రీకరిస్తోంది.

- Advertisement -

వర్షాకాలం వల్ల ఎదురయ్యే అనారోగ్య పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించి, వివిధ జిల్లాల అధికారులతో పాటు, సామాజిక సంస్థలతో కూడా సమన్వయంతో దీనిని అమలు చేస్తోంది. నీళ్లు, వాయువు కారణంగా వ్యాపించే వ్యాధులను అరికట్టడమే ప్రస్తుతం ప్రభుత్వం ప్రధాన ధ్యేయంగా పెట్టుకుంది. ఒకవేళ వ్యాధులు ప్రబలే పక్షంలో వెనువెంటనే స్పందించి చర్యలు
తీసుకోవడానికి ఆస్పత్రులను, వైద్యశాలలను, ఆరోగ్య కేంద్రాలను కూడా సమాయత్తం చేస్తోంది. ఇటీవల దీనిపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వ్యాధుల వల్ల రాష్ర్టంలో ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోకూడదని ఆమె స్పష్టం చేశారు.
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అమలు చేయనిపక్షంలో కఠిన చర్యలు తీసుకోవడం
జరుగుతుందని కూడా ఆమె అధికారులను హెచ్చరించారు.

వర్షాకాలం ప్రారంభం కాగానే ఇదివరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల పరీక్షలు జరిగేవి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వై.ఎస్.ఆర్ ఆరోగ్య కేంద్రాలన్నిటికీ ఈ పరీక్షలను విస్తరించారు. జ్వరానికి సంబంధించిన కేసు వచ్చినా ఉచితంగా మలేరియా, డెంగ్యూ వ్యాధులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. మలేరియా సోకిన వారికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోనే చికిత్స అందించడం జరుగుతుంది. డెంగ్యూ వ్యాధి సోకిన వారిని దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రులలో ఎలీసా పరీక్ష అందుబాటులో ఉంటుంది.

నీటి నిల్వలను తొలగించడానికి, నీటి ప్రవాహాలకు అడ్డుపడిన చెత్తను తీసేయడానికి రాష్ట్రమంతటికీ సిబ్బందిని పంపించడం కూడా జరిగింది. రాష్ట్రంలో ఎక్కడా నీరు నిల్వ ఉండడానికి వీల్లేదని, నీరు నిలిచినప్పుడు వెంటనే అడ్డంకులు తొలగించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అనేక
ప్రాంతాలలో బ్లీచింగ్ చేయడం, ఫాగింగ్ చేయడం వంటివి ముమ్మరంగా జరుగుతున్నాయి. లోతట్టు ప్రాంతాలలో నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవడం కూడా ప్రారంభం అయింది. ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో చికిత్సా సౌకర్యాలను పెంచడం, మెరుగుపరచడం, సర్వసన్నధ్ధంగా ఉంచడం వంటివి కూడా వేగంగా చోటు చేసుకుంటున్నాయి. వివిధ ప్రాంతాలలో సమస్యలను గుర్తించడానికి వెక్టర్ హైజీన్ యాప్ ను అభివృద్ధి చేయడంతో పాటు, ఏ ఎన్ ఎం, ఆశా, మునిసిపల్ సిబ్బందిని సమాయత్తం చేయడం కూడా జరుగుతోంది. ఇంతకూ, గంబూసా చేపలను కృష్ణా, గుంటూరు జిల్లాలలోని కాలువలు, బావులు, చెరువుల్లో వదలడం పూర్తయింది. మిగిలిన జిల్లాల్లో కూడా ఈ చేపలను వదలడం జరుగుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News