2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కానీ వైసీపీ అధినేత జగన్(Jagan) మాత్రం తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెబుతున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం కూడా జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే స్థానాలు రాలేదని.. అందుచేత ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది.
తాజాగా ఈ అంశంపై అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు(Ayyanna Patrudu) కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రతిపక్ష హోదా అర్హత ఉందంటూ జగన్ అసంబద్ధ వాదన చేస్తున్నారని మండిపడ్డారు. 2024 జూన్ 24వ తేదీన తనకు లేఖ రాశారని.. కానీ అందులో అభ్యర్థన లేకుండా అభియోగాలు, బెదిరింపులు చేశారని తెలిపారు. కొద్దిరోజుల తర్వాత హైకోర్టుకు కూడా వెళ్లారని తెలిపారు. దీనిపై న్యాయస్థానం స్పీకర్‌కు నోటీసులు జారీ చేసినట్లు జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష హోదా కావాలంటే నిబంధనల ప్రకారం 1/10 సీట్లు రావాలని.. కానీ వైసీపీకి రాలేదని చెప్పారు. అందుచేత వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. దేవుడే తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించడం తప్పని చురక అంటించారు.