బేతంచర్ల పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీల రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా బేతంచర్లలో అంగన్వాడీల సమ్మె 11వ రోజుకు చేరింది. సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్ నందు రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి వైబి. వెంకటేశ్వర్లు , ఏపీ అంగన్వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జి. షేబా రాణి, అంగన్వాడి వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ పట్టణ మరియు మండల కార్యదర్శులు ఎన్ కె నాగలక్ష్మి, ఎస్.గుల్జార్ బీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి, వైసిపి ప్రభుత్వంలో అంగన్వాడీలకు అడుక్కుతినే పరిస్థితులు దాపురించాయని,11 రోజుల నుండి సమ్మె చేస్తున్నా ,సమస్యలు పరిష్కరించకుండా,రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా, దుర్మార్గంగా వ్యవహరిస్తూ అంగన్వాడి సెంటర్లను సచివాలయ సిబ్బందితో నడపాలని నిర్ణయించడం అన్యాయమని, అంగన్వాడీ సెంటర్లను సచివాలయాలకు అప్పగిస్తామంటే సహించమని, పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. తాళాలు బద్దలు కొడితే సెంటర్లు నడవవని టీచర్లు, ఆయాలు ఉంటేనే సెంటర్లు నడుస్తాయన్న జ్ఞానోదయం ప్రభుత్వానికి త్వరలోనే బోధపడుతుందన్నారు. ప్రభుత్వమే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ప్రోత్సహించడం సిగ్గుచేటు అని, సమ్మె వల్ల కలిగే పర్యవసానాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని, ప్రభుత్వం రెచ్చగొట్టే చర్యలకు తక్షణమే స్వస్తి పలికి సమ్మెను సామరస్యంగా పరిష్కరించాలని, కార్మిక వర్గం కన్నెర్ర చేస్తే రాబోవు ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని హితవు పలికారు.
వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా పాదయాత్ర సందర్భంగా, గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మళ్లీ ఎన్నికలు వచ్చినా అమలు చేయకపోవడం సిగ్గుచేటని ఆగ్రహంవ్యక్తంచేశారు. అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు, మినీ వర్కర్లకు ప్రమోషన్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు, ఆఖరి వేతనంలో 50% పెన్షన్, హెల్పర్ల ప్రమోషన్లలో నిబంధనలు రూపొందించడం, రాజకీయ జోక్యం అరికట్టడం, ప్రమోషన్ వయసు 50 సంవత్సరాలకు పెంచడం, సర్వీస్ లో ఉండి చనిపోయిన అంగన్వాడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం, బీమా అమలు చేయడం, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచడం, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం, వైయస్సార్ సంపూర్ణ పోషణ, మెనూ చార్జీలు పెంచడం, గ్యాస్ ను ప్రభుత్వమే సరఫరా చేయడం, పెండింగ్లో ఉన్న సెంటర్ అద్దెలు, 2017 టీఏ బిల్లులు, ఇతర బకాయిలు వెంటనే చెల్లించాలని, లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలని,వివిధ రకాల యాప్ లను రద్దుచేసి, ఓకే యాప్ ద్వారా విధులు నిర్వహించే విధానం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంజలి, ఇ.అనూష, మేరీ, బి లక్ష్మీదేవి, పద్మావతి, ఐ. జ్యోతి, రాజేశ్వరి,, వెంకటలక్ష్మి, అధిక సంఖ్యలో అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.