నేను ముఖ్యమంత్రిని అయ్యాకే మళ్లీ సభకు వస్తాను తప్ప నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇదొక కౌరవ సభ. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి కౌరవ సభలో నేనుండనని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.. నా అవమానం మీరందరూ అర్థం చేసుకుని నిండు మనస్సుతో ఆశీర్వదించమని కోరుతున్నా…
- ఏపీ అసెంబ్లీలో జరిగిన అవమానంపై నాడు చంద్రబాబు వ్యాఖ్యలివి
అదిగో… ఆ శపథం నేడు నెరవేరింది. 2024లో జగన్ అరాచకపాలనకు చరమగీతం పాడుతూ తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి పట్టం కట్టారు. నాలుగో సారి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ రోజు ఏమైందంటే… అది 2021 నవంబర్ 19. ఆ రోజు రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం సాగింది. తాను మాట్లాడుతుండగా స్పీకర్ మైక్ కట్ చేశారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించి బయటకు వచ్చారు. వెంటనే తన ఎమ్మెల్యేలతో సమావేశమైన చంద్రబాబు ఒక్కసారిగా బోరున విలపించారు. అసెంబ్లీలో అధికార పార్టీ సభ్యులు తన భార్యను అవమానించేలా మాట్లాడారని గద్గద స్వరంతో వివరించారు. ఇది అందరినీ కంటతడిపెట్టించింది. ఆ పార్టీ అభిమానులతో పాటు ఇతరులు కూడా బాధపడ్డారు. వైసీపీ దుర్మార్గానికి ఇది పరాకాష్ట అని తీవ్రంగా ధ్వజమెత్తారు.
చంద్రబాబు ఏమన్నారంటే…
నా రాజకీయ జీవితంలో ఏనాడు, ఎవ్వరినీ అవమానించేలా మాట్లాడలేదు. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగలేదు. అధికారం పోయినప్పుడు కుంగిపోలేదు. ఎవరి విషయంలోనూ అమర్యాదగా ప్రవర్తించలేదు. అయితే ఈ రోజు నా భార్య గురించి అసెంబ్లీలో వైసీపీ నాయకులు మాట్లాడిన భాష నీచంగా ఉంది…. అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిదిసార్లు ఎన్నికైన తన అనుభవంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాకే మళ్లీ అసెంబ్లీలో అడుగుపెడతానని ఆయన శపథం చేశారు. అది ఇప్పడు నెరవేరుతోంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు సీఎంగానే అసెంబ్లీకి వస్తానంటూ శపథం చేసిన సమయంలో ఎంతోమంది ఎగతాళి చేశారు. ఆయన మరోసారి సీఎం అయ్యే అవకాశం లేదంటూ హేళన చేశారు. వాటన్నింటిని టీడీపీ అధినేత పట్టించుకోలేదు. ప్రజలనే నమ్ముకున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం టీడీపీని గెలిపించాలని ప్రజలను కోరారు. బాబుపై విశ్వాసం ఉంచిన ప్రజలు భారీ మెజార్టీతో తెలుగుదేశం కూటమిని అధికారంలోకి తీసుకువచ్చారు ముఖ్యమంత్రిని అయ్యాకే మళ్లీ సభలో అడుగుపెడతానన్న చంద్రబాబు మరోసారి సీఎం కాబోతుండడంపై టీడీపీ శ్రేణులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నాయి. అసెంబ్లీ సాక్షిగా జరిగిన అవమానానికి బదులుగా ప్రజలు చంద్రబాబును ఆశీర్వదించి మళ్లీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి పంపిస్తున్నారని గుర్తు చేసుకుంటున్నాయి.