అంబేద్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఢిల్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై ఏపీ సీఎం చంద్రబాబు కేబినెట్‌లో ప్రస్తావించారు. ఈ సందర్భంగా మంత్రులకు పలు సూచనలు చేశారు. సున్నితమైన అంశాలపై జాగ్రత్తగా మాట్లాడాలని తెలిపారు. మనం మంచి ఉద్దేశంతో మాట్లాడినా చెడుగా ప్రచారం చేసేవారు ఉంటారని పేర్కొన్నారు. గతంలో తాను వ్యవసాయం దండగ అని అనకపోయినా ఆ మాట అన్నట్టుగా ప్రచారం చేశారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ హయాంలో అంబేద్కర్‌కు తగిన గౌరవం లభించలేదన్నారు. ఎన్నికల్లో అంబేద్కర్ ఓడిపోయింది కూడా కాంగ్రెస్ హయాంలోనే అన్నారు. వీపీ సింగ్ హయాంలో పార్లమెంటు ఆవరణలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని వెల్లడించారు. అందుకేఉ అంబేద్కర్‌కు ఎవరి ద్వారా గుర్తింపు వచ్చిందనే అంశంపై జరగాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
కాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్‌ను అవమానించారంటూ దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. పార్లమెంటు ప్రాంగణంలో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల మధ్య జరిగిన తోపులాటలో పలువురు ఎంపీలు గాయపడిన విషయం విధితమే. అమిత్ షా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతున్న వేళ చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.