Vahana Mitra Scheme: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభలో కీలక ప్రకటనలు చేశారు. ముఖ్యంగా, ఆటో డ్రైవర్లకు దసరా పండుగ సందర్భంగా శుభవార్త చెప్పారు. దసరా రోజున ‘వాహన మిత్ర’ పథకం కింద ఒక్కో ఆటో డ్రైవర్‌కు రూ. 15,000 ఇస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘స్త్రీ శక్తి’ పథకం అమలు తర్వాత ఆటో డ్రైవర్లు తమ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పథకం ద్వారా వారిని ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
చంద్రబాబు తన ప్రసంగంలో ‘సూపర్ సిక్స్’ హామీలను అమలు చేశామని స్పష్టం చేశారు. సంక్షేమం అంటే కేవలం ఓట్ల రాజకీయాలు కాదని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం జవాబుదారీగా, బాధ్యతతో పనిచేస్తోందని, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని వివరించారు. 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కూటమి పార్టీలకు 95% పైగా స్ట్రైక్ రేట్ ఇచ్చి చరిత్ర సృష్టించారని ఆయన గుర్తు చేసుకున్నారు.
Rainfall Alert : ఉత్తరాంధ్ర, కోస్తాలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన వ్యవస్థలను తిరిగి గాడిలో పెడుతున్నామని చంద్రబాబు అన్నారు. ‘స్త్రీ శక్తి’ పథకం కింద ఇప్పటివరకు ఐదు కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేశారని, ఈ పథకం జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేసి తల్లుల నమ్మకాన్ని నిలబెట్టామని, ఒక్కో విద్యార్థికి రూ. 15,000 ఇచ్చామని చెప్పారు.
అలాగే, రైతుల సంక్షేమం కోసం ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద 47 లక్షల మంది ఖాతాలలో నగదు జమ చేశామని, ‘దీపం’ పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తున్నామని వివరించారు. ఈ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని తెలిపారు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. మొత్తం మీద, తమ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలను అమలు చేసి గర్వంగా ప్రజల ముందుకు వచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ పథకాలన్నీ ప్రజల సంక్షేమానికి తమ నిబద్ధతకు నిదర్శనమని ఆయన అన్నారు.


