ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు(Chandrababu) శుభవార్త తెలిపారు. ఎంత మంది పిల్లలు ఉన్నా ప్రసూతి సెలవులు ఇస్తామని ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో మహిళలతో ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఉద్యోగులకు ఇద్దరు పిల్లల వరకే ప్రసూతి సెలవులు ఉండగా.. ఇక నుంచి ఎంత మంది పిల్లలకైనా సెలవులు ఇస్తామన్నారు. ఒకప్పటి పరిస్థితుల దృష్ట్యా అధిక సంతానం వద్దని చెప్పిన తానే.. ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు కనాలని చెబుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఎంత మంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం పథకం రూ.15వేలు ఇస్తామని స్పష్టం చేశారు.
ఇక మహిళల భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే అదే వారికి ఆఖరు రోజవుతుందని మరోసారి హెచ్చరించారు. మహిళలు సంపాదించకపోతే పురుషులు చులకనగా చూస్తారని చెప్పారు. ఆడబిడ్డలు సంపాదించేందుకే గతంలో డ్వాక్రా సంఘాలు సృష్టించామని వెల్లడించారు. కాగా ఈ కార్యక్రమంలో మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ రూపొందించిన ‘శక్తి’ యాప్ ఆయన ఆవిష్కరించారు. చేనేత ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించేలా చేనేత రథాన్ని ప్రారంభించారు.