గుంటూరు మిర్చి యార్డు పర్యటనలో పోలీసులు మాజీ సీఎం జగన్(Jagan)కు సరైన భద్రత కల్పించలేదంటూ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. అలాగే కేంద్ర బలగాలతో జగన్‌కు రక్షణ కల్పించాలని ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి లేఖ రాశారు.
తాజాగా దీనిపై సీఎం చంద్రబాబు(Chandrababu) స్పందించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటనకు వెళ్లడం ఏంటని మండిపడ్డారు. ఈసీ అనుమతి లేకున్నా.. నిబంధనలు ఉల్లంఘించి ఇష్టానుసారం చేస్తానంటే కుదరదని హెచ్చరించారు. రౌడీయిజం చేస్తామని.. పోలీసుల రక్షణ ఇవ్వాలంటే ఎలాగని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలని సూచించారు.
ఇక విదేశాల్లో డిమాండ్ తగ్గడం వల్ల ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది మిర్చి రేట్లు పడిపోయాయని చెప్పారు. మిర్చి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనిపై కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో చర్చించామన్నారు. ధరల స్థిరీకరణకు ఏం చేయాలో ఆలోచిస్తామని చంద్రబాబు వెల్లడించారు.