Chandra babu| కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని అమరాతి ప్రాంతం మళ్లీ ఊపిరి పీల్చుకుంటోంది. గత ఐదేళ్లుగా స్తబ్ధుగా ఉన్న రాజధాని ప్రాంతం ఇప్పుడు అభివృద్ధి పట్టాలపై దూసుకెళ్లేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే తాజాగా సీఎం చంద్రబాబు రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించారు. తుళ్లూరు మండలం ఉద్దండరాయుని పాలెం వద్ద నిర్మిస్తున్న సీఆర్‌డీఏ(CRDA) ఆఫీసు పనులను ప్రారంభించి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ భవన ప్రాంగణంలో చంద్రబాబు, మంత్రి నారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొత్తం 3.62 ఎకరాల్లో జీ ప్లస్ 7 భవనాన్ని ఇక్కడ ప్రభుత్వం నిర్మిస్తోంది. అదనంగా పార్కింగ్, ల్యాండ్ స్కేపింగ్‌కు 2.51 ఎకరాల విస్తీర్ణం కేటాయించారు. ఆర్కిటెక్చరల్ ఫినిషింగ్స్, ఇంటీరియర్స్, ఎలక్ట్రిక్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి.
కాగా గత టీడీపీ ప్రభుత్వం హయాంలో రూ.160 కోట్లతో ఏడంతస్తుల్లో సీఆర్‌డీఏ(CRDA) కార్యాలయ పనులు చేపట్టారు. ప్రాజెక్టు కార్యాలయ నిర్మాణాన్ని 2017లో ప్రారంభించారు. సగం నిర్మాణం పూర్తి కాగానే 2019 ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే వైసీపీ మూడు రాజధానుల నినాదం అందుకోవడంతో అమరావతి నిర్మాణ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతిలో నిలిచిపోయిన పెండింగ్ పనులు ఊపందుకున్నాయి.
సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయకముందే అమరావతి ప్రాంతం జంగిల్ క్లియర్ పనులు మొదలుపెట్టారు. గత ఐదేళ్లుగా పిచ్చి మొక్కలు, ముళ్ల కంపలతో నిండిపోయిన రాజధాని ప్రాంతాన్ని క్లియర్ చేసే పనిలో పడ్డారు. మూడు నెలల పాటు కష్టపడి జంగిల్ క్లియరెన్స్ పూర్తి చేశారు. దీంతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. డిసెంబర్ నెలాఖరు కల్లా సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, ఎమ్మెల్యే క్వార్టర్స్, ప్రభుత్వ అధికారుల భవనాల నిర్మాణాలకు సంబంధించిన టెండర్లను పూర్తి చేయనున్నారు. టెండర్లు పూర్తి కాగానే చకచకా నిర్మాణాలు చేపట్టనున్నారు. రెండేళ్లలో ఈ నిర్మాణాలు పూర్తిచేయడంతో పాటు మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. గత అనుభవాల దృష్ట్యా 2029 ఎన్నికల లోపు రాజధాని నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది.