Jagan comments on legendary actress Saroja Devi’s death: పద్మభూషణ్ అవార్డు గ్రహీత, లెజెండరీ నటి బి.సరోజాదేవి అకాల మరణం చెందిన నేపథ్యంలో, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆమె మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో అపారమైన చలనచిత్ర ప్రస్థానం సాగించిన సరోజాదేవి గారు, ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. ఆమె చేసిన సేవలు భారతీయ సినీ రంగ చరిత్రలో మరపురానివిగా నిలుస్తాయి. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ విచారకరమైన సమయంలో సరోజాదేవి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను,” అని వైఎస్ జగన్ తన శోక సందేశంలో పేర్కొన్నారు.
బెంగళూరులో కన్నుమూత
సరోజాదేవి సోమవారం ఉదయం బెంగళూరులోని తన నివాసంలో కన్నుమూశారు. ఆమె వయస్సు 86 సంవత్సరాలు. 1938లో కర్ణాటకలో జన్మించిన సరోజాదేవి, 13వ ఏటే నటనా రంగంలోకి ప్రవేశించారు. 1955లో విడుదలైన కన్నడ చిత్రం ‘మహాకవి కాళిదాస’ ద్వారా సినీ ప్రపంచానికి పరిచయమయ్యారు. తర్వాత తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో దాదాపు 200కి పైగా చిత్రాల్లో నటించి విశేష గుర్తింపు పొందారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్ వంటి మహానటులతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆమె నటన, సౌందర్యం, శ్రద్ధ – అన్నీ కలసి ఆమెను దక్షిణ భారత సినీ లోకంలో అగ్రస్థానానికి చేర్చాయి. సరోజాదేవి అద్భుతమైన సినీ ప్రస్థానం ప్రభుత్వ గుర్తింపునూ పొందింది. భారత ప్రభుత్వం ఆమెకు 1969లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్ అవార్డులు అందించింది.


