గత కొంత కాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని చికిత్స కోసం ముంబయికి తరలించబడ్డారు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న నానికి మూడు హృదయ కవాటాల్లో బ్లాకులు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. మొదట స్టెంట్లు వేయాలని వైద్యులు అనుకున్నా.. మూడు వాల్వుల్లో సమస్యలు తీవ్రంగా ఉండటంతో వైద్యులు బైపాస్ సర్జరీ చేయాల్సిందేనని సూచించారు. దీనితో పాటు అలాగే మూత్రపిండాల పని తీరు కూడా మందగిస్తున్నందున అత్యుత్తమ వైద్య సదుపాయాలు కలిగిన ముంబయి ఆసుపత్రిలో చికిత్స చేయించాలని నిర్ణయించారు.
అనంతరం కుటుంబ సభ్యులు, వైద్యుల సలహాతో నానిని ప్రత్యేక విమానంలో ముంబయికి తరలించారు. బైపాస్ సర్జరీ కోసం ఆయనను ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చారు. ప్రముఖ కార్డియక్ సర్జన్ డాక్టర్ రామకాంత్ పాండా ఈ శస్త్రచికిత్స నిర్వహించనున్నారు. ఇది వరకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి ప్రముఖులకు ఆయనే సర్జరీ చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిరంతరం సమాచారాన్ని సేకరిస్తున్నారు. వైద్యులు సూచించిన విధంగా ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ పరిస్థితిలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందవద్దని నాని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఇక కొడాలి నానికి ఈ నెల 3వ తేదీన (బుధవారం) బైపాస్ సర్జరీ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు.