వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుకకు(Butta Renuka) చెందిన ఆస్తుల వేలం ప్రక్రియ ప్రారంభమైంది. ఎల్‌ఐసీ అనుబంధ విభాగమైన ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్ నుంచి రూ.310 కోట్లు అప్పు తీసుకున్న రేణుక దంపతులు తిరిగి చెల్లించకపోవడంతో వారి ఆస్తుల వేలానికి సిద్ధమయ్యారు. ఐదేళ్ల నుంచి ఈఎంఐలు కట్టకపోవడంతో బెంగళూరు బ్రాంచి ప్రతినిధులు పలుసార్లు నోటీసులు పంపడంతోపాటు సంప్రదింపులు జరిపినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో బంజారాహిల్స్‌లోని ఐదువేల గజాల ఆస్తిని రూ.145 కోట్లకు వేలం వేయగా ఎవరూ ముందుకు రాలేదు. మాదాపూర్‌లోని 7,205 చ.గజాల్లో ఉన్న బుట్టా కన్వెన్షన్ వేలానికీ స్పందన రాలేదు. మరోసారి వేలానికీ ప్రయత్నిస్తున్నారు.
కాగా రేణుక, ఆమె భర్త నీలకంఠలు 2018లో 15ఏళ్ల కాలవ్యవధిలో తిరిగి చెల్లించేలా రూ.310 కోట్ల రుణం తీసుకున్నారు. బుట్టా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, బుట్టా కన్వెన్షన్ సర్వీసెస్ లిమిటెడ్, మెరిడియన్ ఎడ్యుటెక్ సర్వీసెస్ కార్యకలాపాలకు రుణాన్ని వినియోగించారు. రుణంపై సుమారు రూ.40 కోట్ల వరకు చెల్లించారు. అసలు, వడ్డీ కలిపి ఇంకా రూ.340 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. వడ్డీ భారం ఎక్కువగా ఉన్నందున కొన్ని ఆస్తులు విక్రయించి రుణం రీషెడ్యూలు చేయాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రతిపాదన ఉందని హెచ్‌ఎఫ్‌ఎల్ ప్రతినిధులు అంగీకరించలేదు.