Sunday, May 4, 2025
Homeఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు.. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్..!

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు.. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్..!

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పలు జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఈదురుగాలులు తుఫానులా వీచి ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. పిడుగులు పలు ప్రాంతాల్లో ప్రాణాలు తీస్తుండడంతో ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. తాజా పరిస్థితులపై రాష్ట్ర హోం మంత్రి తానేటి అనిత విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌తో మాట్లాడి అన్ని జిల్లాల్లో తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు.

- Advertisement -

తీవ్ర వర్షపాతం నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, సహాయక చర్యలు వెంటనే ప్రారంభించాల్సిందిగా కలెక్టర్లు, ఎస్పీలకు సూచనలు పంపించారు. తాగునీరు, విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం, రాష్ట్రంలో వచ్చే రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది.

ఇప్పటికే బాపట్ల జిల్లాలో కురిసిన వర్షం విజృంభించింది. చినగంజాం మండలంలో పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతిచెందగా, తిరుపతిలో గాలివానతో చెట్లు నేలకొరిగాయి, హోర్డింగ్స్ కూలిపోయాయి. నెల్లూరు జిల్లా నాయుడుపేట, ఓజిలి మండలాల్లో పిడుగుపాటుతో ఇద్దరు మరణించారు. విజయవాడ నగరంలో భారీ వర్షం కురవడంతో ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్‌ను భద్రతా కారణాల వల్ల మూసివేశారు. ట్రాఫిక్ అంతరాయానికి దారితీయకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాలకు రెడ్ అలర్ట్, 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రకాశం, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో గంటకు 60 నుంచి 85 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే అల్లూరి సీతారామరాజు, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనూ వర్షాలు నష్టం కలిగించాయి. ధాన్యం, మొక్కజొన్న తడవడంతో రైతులు ఆవేదనకు గురవుతున్నారు. మామిడి కాయలు విరిగిపడటంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో పలు శాఖల మధ్య సమన్వయం అవసరమని, ప్రతి శాఖ తన బాధ్యతను నిర్లక్ష్యం చేయకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి కొలుసు పార్థసారధి ఆదేశించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News