Anitha| బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. ముఖ్యంగా తిరుపతి జిల్లాలోని తిరుమల, సూళ్లూరుపేట ప్రాంతాల్లో భారీ వర్షం నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తిరుమల ఘాట్ రోడ్లలో ప్రయాణించే శ్రీవారి భక్తులు జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. అలాగే కొండచరియలు ప్రాంతాల్లో నివసించే ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
జిల్లాలో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న లక్ష్మీపురం కూడలి, గొల్లవానిగుంట లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు