Janasena Party: ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికల గడువు రానున్న నేపథ్యంలో అధికార వైసీపీని ఢీకొట్టేందుకు టీడీపీ, జనసేన పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికార పార్టీతో అమితుమీకి సిద్ధమవ్వగా.. టీడీపీసైతం వైసీపీపై ఎదురుదాడి చేస్తుంది. అయితే, ప్రస్తుతానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో కలిసి ముందుకెళ్తున్నారు. కానీ , వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీలకుండా అన్ని పార్టీలు ఏకంకావాల్సిన అవసరం ఉందని చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ, జనసేన కలుస్తాయని ప్రచారం జరిగింది. అధికార పార్టీసైతం ఇదే విషయాన్ని ప్రచారం చేస్తుంది.
వచ్చే ఎన్నికల్లో జనసేన బీజేపీతోనే కలిసి వెళ్తుందా? లేకుంటే టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తుందా? అనేది ప్రశ్నగా మారింది. ఈ విషయంపై జనసేన శ్రేణుల్లోనూ గందరగోళం నెలకొంది. తాజాగా ఈ విషయంపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడారు.. ఆదివారం ఆయన శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో జనవరి 12న రణస్థలంలో యువశక్తి పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమం గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. వచ్చే ఏడాది మార్చి 14న ఇప్పటం గ్రామంలో జరిగిన సభలో పవన్ కల్యాణ్ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అంతా కలిసికట్టుగా ముందుకు రావాలని సూచించారు.
పొత్తుల విషయంపై మనోహర్ స్పందించారు.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా బాధ్యత తీసుకోవాలని, అందుకు మా వంతు సహకారం అందిస్తామని చెప్పారు. అంటే టీడీపీతో పొత్తుతో ఎన్నికలతో వెళ్తారా అని విలేకరులు ప్రశ్నించగా.. అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని, ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేఖ ఓటును మాత్రం చీలనివ్వమని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గతంలో ఇదే విషయాన్ని పవన్ కూడా స్పష్టం చేశారు.