Kanaka Durga: మన తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ కనక దుర్గమ్మ గుడి ఎంతో ప్రసిద్ధి చెందింది. నిత్యం వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో తమ తమ మొక్కలు చెల్లించుకుని కానుకలు సమర్పిస్తుంటారు. ఈ క్రమంలో భక్తులు కానుకగా సమర్పించిన బంగారాన్ని ఆలయ అధికారులు బ్యాంకుల్లో భద్రపరచడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో అమ్మవారికి చెందిన 29.510 కిలోల బంగారాన్ని తాజాగా బ్యాంకులో డిపాజిట్ చేశారు ఆలయ అధికారులు. విజయవాడ గాంధీనగర్‌లోని ఎస్‌బీఐ బ్యాంకులో దుర్గమ్మ బంగారాన్ని డిపాజిట్ చేశారు.
అయితే ఈ 29.510 కిలోల బంగారం విలువ సుమారు రూ.26.05 కోట్లు ఉండొచ్చని అంచనా. డిపాజిట్ చేసిన ఆభరణాలన్నీ 22 క్యారెట్లు కావడం విశేషం. ఈ బంగారంపై బ్యాంక్ ఏడాదికి 0.60 శాతం వడ్డీని ఇవ్వనుంది. ఇదే విషయాన్ని దుర్గమ్మ ఆలయ ఈవో ఓ ప్రకటనలో తెలియజేశారు. ఎలాంటి అవకతవకలకు చోటివ్వకుండా పక్కా ఏర్పాట్లతో బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు స్పష్టం చేశారు.
భక్తులకు గుడ్ న్యూస్!!
మరోవైపు కనక దుర్గమ్మ అమ్మవారికి సేవ చేయాలనుకునే భక్తులకు ఆలయ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. స్వచ్ఛంద సేవ చేయాలనుకునేవారు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆఫ్ లైన్‌లోనే కాకుండా త్వరలోనే ఆన్‌లైన్‌లోనూ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తామని అధికారులు వివరించారు.
భక్తులకు అన్నప్రసాదం, అర్జిత సేవలు, క్యూలైన్లు, పార్కింగ్, సామాన్ల గదులు వంటి వాటికి వీరి సేవలను వినియోగించనున్నారు. సేవ చేయడానికి వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు బోనాల పండుగ సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు.


