ఆరు కుంకీ ఏనుగులను (Kumki Elephants) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్ణాటక ప్రభుత్వం అప్పగించింది. బెంగళూరులోని విధానసౌధలో ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) సమక్షంలో ఈ అప్పగింత కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కుంకీ ఏనుగుల అప్పగింత, వాటి సంరక్షణకు సంబంధించిన డాక్యుమెంట్లను పవన్‌కు సిద్ధరామయ్య అందజేశారు. గతేడాది ఆగస్టులో ఏపీకి కుంకీ ఏనుగులు పంపించాలని కర్ణాటక ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ లేఖ రాసిన సంగతి తెలిసిందే.
అనంతరం పవన్ మాట్లాడుతూ.. కుంకీ ఏనుగులు ఇచ్చిన సీఎం సిద్ధరామయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య సహకారం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. కుంకీ ఏనుగుల సంరక్షణకు ఏపీలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. కుంకీ ఏనుగులను సంరక్షించే బాధ్యతను అటవీశాఖ మంత్రిగా తాను స్వయంగా తీసుకుంటానని హామీ ఇచ్చారు. కాగా పంటపొలాల్ని నాశనం చేస్తున్న అడవి ఏనుగులను నియంత్రించేందుకు కుంకీ ఏనుగులను రంగంలోకి దించుతారు. ఏనుగుల గుంపును అడవిలోకి తిరిగి పంపించేంత వరకు ఇవి విశ్రమించవు. ఆ విధంగా వీటికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు.