Tuesday, July 2, 2024
Homeఆంధ్రప్రదేశ్Katasani: 'నవరత్నాల'తో పేదల జీవితాల్లో వెలుగులు

Katasani: ‘నవరత్నాల’తో పేదల జీవితాల్లో వెలుగులు

ఇంటింటికీ వెళ్లి పథకాలపై ఆరా తీసిన ఎమ్మెల్యే

‘నవరత్నాల’ సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెలుగులు నింపారని వైయస్ఆర్ సిపి జిల్లాల అధ్యక్షులు, మేయర్ బి.వై. రామయ్య, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. 19వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా 50వ సచివాలయం పరిధిలో కార్యక్రమాన్ని నిర్వహించారు.

- Advertisement -

ఇంటింటికి వెళ్లి పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. మహిళలను, వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ నాలుగేళ్లలో ప్రభుత్వం నుంచి పొందిన లబ్ధిని వివరించి బుక్లెట్లను పంపిణీ చేశారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తమకు తెలియజేయాలని సూచించారు. తాగునీరు పైపులైన్ వేయించాలని, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని, మురుగు కాలువలు నిర్మించాలని, సీసీ రోడ్లు వేయాలని స్థానికులు కోరగా ఆయా సమస్యలను సకాలంలో పరిష్కారించాలని సంబంధిత అధికారులను మేయర్, ఎమ్మెల్యే ఆదేశించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కోవిడ్‌ సంక్షోభంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలు అయినప్పటికి సంక్షేమ పథకాల అమలును రాష్ట్ర ప్రభుత్వం నిరాటంకంగా కొనసాగించిందని గుర్తు చేశారు. పథకాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా సంక్షేమ క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించి తు.చ. తప్పకుండా అమలు చేసి చూపించారని పేర్కొన్నారు. బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు పారదర్శకంగా నగదు జమ చేసి, అవినీతికి ఆస్కారం లేకుండా చేశారన్నారు.

ఎమ్మెల్యే కాటసాని మాట్లాడుతూ నవరత్నాల ద్వారా పేద, దిగువ మధ్య­తరగతి కుటుంబాలు పేదరికాన్ని అధిగమించేలా సిఎం జగన్ చర్యలు తీసుకున్నారని తెలిపారు. ప్రజల సామాజిక, ఆర్థిక అంశాల్లో ప్రతి ఇంట్లో ఓ బలమైన మార్పు తెచ్చేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారని వెల్లడించారు.

పారిశుద్ధ్య కార్మికులకు రెయిన్ కోట్స్

ప్రస్తుత వాన కాలంలో కూడా విధులు నిర్వహిస్తూ నగరాన్ని శుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ధ్య కార్మికులకు నగర పాలక సంస్థ అధ్వర్యంలో వాన తొడుగులు (రెయిన్ కోట్) పంపిణీ చేస్తున్నట్లు నగర మేయర్ బి.వై. రామయ్య, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. 19వ వార్డులోని కార్మికులకు వాన తొడుగులు (రెయిన్ కోట్) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల పట్ల సంక్షేమానికి తమ ప్రభుత్వానికి, తమకు చిత్తశుద్ధి ఉందన్నారు. వారికి జీవిత/ప్రమాద బీమా చేయించామని, ప్రతి ఏటా వస్త్రాలు, కిట్లు అందజేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత వానకాలంలో కార్మికులు తడవకుండా ఉండేందుకు రూ.3.85 లక్షలతో వెయ్యి మంది పారిశుధ్య కార్మికులకు వాన తొడుగులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు.

కార్యక్రమంలో రాష్ట్ర వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎన్.గోపాల్ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బెల్లం మహేశ్వర రెడ్డి, వైయస్ఆర్ సిపి మహిళా విభాగం జోనల్ ఇంచార్జ్ గాజుల శ్వేత రెడ్డి, కార్పొరేటర్లు నాగలక్ష్మి రెడ్డి, వైజ అరుణ, లక్ష్మికాంత రెడ్డి, నారాయణ రెడ్డి, వై.వెంకటేశ్వర్లు, డిఈఈ రవిప్రకాష్ నాయుడు, ట్యాప్ ఇంస్పెక్టర్ రఫిక్, శానిటేషన్ ఇంస్పెక్టర్ ఆర్.రాజు, మేస్త్రి నర్సింహులు, కల్లూరు సింగిల్ విండో ప్రెసిడెంట్ పందిపాడు శివశంకర్ రెడ్డి, నాయకులు కనికే శివరాం స్వామి, ఎస్.కే. యూనూస్ బాష, సామన్న, శ్రీధర్ రెడ్డి, బాలచంద్ర రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, బాబుల్ రెడ్డి, బాబన్న, ఇలియాస్, అనిల్ కుమార్, తిరుపాలు, శ్రీను, మధు, గోకారి, చిన్న, శ్రీనివాస రెడ్డి, వేదవతి, సుభాషిణి, సంజీవ రెడ్డి, రాజేష్, రమణ, సంతోష్, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News