ఏపీ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మాజీ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani)2024 ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా సొంత తమ్ముడైన టీడీపీ అభ్యర్థి )కేశినేని చిన్నిపై పోటీ చేశారు. అయితే తమ్ముడు చేతిలో ఘోరంగా ఓడిపోయారు. మరోవైపు వైసీపీ కూడా దారుణంగా ఓడిపోయి అధికారానికి దూరమైంది. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే రాజకీయాలకు కేశినేని నాని గుడ్ బై చెప్పేశారు. అప్పటి నుంచి సైలెంట్ అయిపోయిన మళ్లీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తారనే ప్రచారం ఊపందుకుంది. బీజేపీలో చేరబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
తాజాగా ఈ ప్రచారంపై నాని స్పందించారు. ఈ ఏడాది జూన్‌లోనే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించానని తెలిపారు. తన నిర్ణయం మారదని క్లారిటీ ఇచ్చేశారు. అయితే ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోనే ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రజాసేవ అనేది జీవితాంతం నిబద్దత అని, కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఉంటుందని నాని తెలిపారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల సంక్షేమంకోసం నిరంతరం కృషి చేస్తానని వెల్లడించారు. తాను రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాననే వార్తలను నమ్మవొద్దని కోరారు. తన రాజకీయ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.