కొన్ని రోజులుగా ఏపీ మంత్రివర్గంలో ఇద్దరు, ముగ్గురు సభ్యులను తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది. వారిలో విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్(Kondapalli Srinivas) పేరు కూడా ఉంది. ఇందుకు కారణం ఆయన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) కాళ్లు పట్టుకున్నారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రచారంపై తాజాగా కొండపల్లి స్పందించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నవంబర్ 11న అసెంబ్లీ లాబీలో ఇతర ఎమ్మెల్యేలతో పాటు తాను కూర్చొని ఉన్న సమయంలో బొత్స వచ్చారని.. అందరితో పాటు తాను కూడా లేచి సంస్కారంతో పలకరించానని తెలిపారు.
ఇంతకుమించి ఏమీ జరగలేదని.. సంస్కారంతో నమస్కారం పెడితే ఇంత దుష్ప్రచారం చేస్తారా అని ఫైర్ అయ్యారు. తమ కుటుంబానికి 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉందని బొత్స కుటుంబంపై పోరాడుతున్నామని పేర్కొన్నారు. అలాంటింది తాను బొత్స కాళ్లు ఎందుకు పట్టుకున్నానంటూ నిలదీశారు. విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబం వల్ల చాలా మంది అన్యాయానికి గురయ్యారని ఆరోపించారు. త్వరలోనే చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేస్తామన్నారు. బొత్స కుటుంబం జిల్లాలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు.