ఓర్వకల్లు విమానాశ్రయం పరిసరాల్లో ఎటువంటి చెత్త, చెదారాలు లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు విమానాశ్రయ భద్రతకు కావలసిన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన విమానాశ్రయ పర్యావరణ నిర్వహణ కమిటీలో అధికారులను ఆదేశించారు. ఓర్వకల్లు విమానాశ్రయ సమావేశ మందిరంలో ఏరోడ్రోమ్ కమిటీ, ఎయిర్ ఫీల్డ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన, జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ పాల్గొన్నారు.
ప్రతి ఆరు నెలలకు ఒకసారి జరగవలసిన విమానాశ్రయ పర్యావరణ నిర్వహణ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన గారు మాట్లాడుతూ విమానాల రాకపోకలకు 10 కిలోమీటర్ల దూరం విమానాశ్రయ పరిసరాలు అనుకూలంగా ఉండాలన్నారు. అందుకుగాను 10 కిలోమీటర్ల మేరకు విమానాశ్రయ పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉంచుకోవాలన్నారు. సదరు అంశాలను పరిగణలోకి తీసుకొని విమానాశ్రయ పరిసరాలు చెత్తా, చెదారం లేకుండా, పశువులు, పక్షులు ఆకర్షింపబడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. విమానాశ్రయ పరిసరాల్లో ఏ సంస్థ లేదా వ్యక్తుల వలన చెత్తా, చెదారాలు, పశువుల మాంసము , కోళ్ల మాంసపు కళేబరాల వ్యర్ధాలు చేరకుండా చర్యలు తీసుకోవాలని ఈఓపిఆర్డి, ఎంపిడిఓ, డిపిఓ లను కలెక్టర్ ఆదేశించారు. ఎవరైనా చెత్తాచెదారాలు వేస్తున్నట్లయితే వారికి నోటీసులు ఇచ్చి పెనాల్టీలు వేయాల్సిందిగా ఆదేశించారు. విమానాశ్రయంలో వృక్షాల ఆకులు మరియు మిగిలిపోయిన ఆహార పదార్థాల వలన వచ్చే చెత్తలను ఎరువుగా మార్చుకోవటానికి, ఇతరత్రా వచ్చే అన్ని చెత్తలను వివిధ రకాలుగా వేరుచేసి వాటిని దూరంగా తరలించే విధంగా వారికి శిక్షణ ఇప్పించవలసిందిగా మున్సిపల్ కమిషనర్ కర్నూలు మరియు డిపిఓ ని కలెక్టర్ ఆదేశించారు.
విమానాశ్రయ పరిసరాల్లో మైనింగ్ వల్ల దుమ్ము, ధూళి, రాకుండా మైనింగ్ నిమిత్తం పేలుళ్లు జరపకుండా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ శాఖ వారిని కలెక్టర్ ఆదేశించారు. ఈ చర్యలు అతిక్రమించిన వారికి పెనాల్టీ విధించాలని కూడా ఆదేశించినారు. విమానాశ్రయ పరిసరాల్లో ఎన్ఆర్ఈజిఎస్ క్రింద పనులు చేపట్టి పరిసరాలని శుభ్రంగా అందంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకోవాలని ఓర్వకల్లు ఎంపిడిఓను కలెక్టర్ ఆదేశించారు. విమానాశ్రయ అవసరం నిమిత్తం ఇంకా 36 ఎకరాల స్థలము కేటాయింపు పెండింగ్లో ఉందని డైరెక్టర్ తెలుపగా వెంటనే వారికి స్థలం కేటాయించాలని ఓర్వకల్లు తహసిల్దార్ ని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా విమానాశ్రయ భద్రతపై పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేసుకుని విమానాశ్రయ భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని కర్నూలు ఎస్పీ జి. కృష్ణకాంత్ కు కలెక్టర్ సూచించారు.
గత 2021 సంవత్సరం నుండి 2023 జూన్ వరకు దాదాపు 80,312 మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. ఈ విమానాశ్రయ భద్రతకు ప్రతిరోజు బాంబు స్క్వాడ్ తనిఖీలు, బాంబు డిటెక్షన్ మరియు నిర్వీర్యము వంటి చర్యలు, అగ్నిమాపక శకటాల ద్వారా నిరంతర మాక్ డ్రిల్స్ నిర్వహించుకుంటూ విమానాశ్రయాన్ని సురక్షితంగా ఉంచాలని విమానాశ్రయ డైరెక్టర్ మరియు సిబ్బందిని ఆదేశించినారు. అనంతరం విమానాశ్రయ ఎయిర్ క్రాష్ ఫైర్ టెండర్ (అగ్నిమాపక శకటం) లో కలెక్టర్, ఎస్పీ, డైరెక్టర్ విమానాశ్రయ రన్వే మరియు విమానాశ్రయం బౌండరీ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సమావేశంలో కర్నూలు ఎస్పీ కృష్ణకాంత్, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భార్గవ తేజ, విమానాశ్రయ డైరెక్టర్ విద్యాసాగర్, విమానాశ్రయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కృష్ణయ్య, మధుసూదన్ డిసిఐఓ, డిడి మైన్స్ రాజశేఖర్, డిఎంహెచ్ఓ రామగిడ్డయ్య, డిపిఓ నాగరాజు నాయుడు, డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ శివశంకర్ రెడ్డి, ఏపీయఎస్పీ డీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్, ఓర్వకల్లు తహసిల్దారు, ఓర్వకల్లు ఎంపిడిఓ, ఇండిగో విమాన సంస్థ ప్రతినిధులు గ్రౌండ్ కంట్రోల్ విభాగము వారు స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.