Zakia Khanam| శ్రీవారి టికెట్లు బ్లాక్‌లో అమ్ముకున్నారనే ఆరోపణలతో వైసీపీ ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానంపై తిరుమల రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. శ్రీవారి దర్శన టికెట్లలో మోసం చేశారని బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు ఆమెపై ఫిర్యాదు చేశారు. ఆరు వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లకు తమ నుంచి రూ.65వేలు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎమ్మెల్సీతో పాటు ఆమె పీఆర్వో కృష్ణతేజ, చంద్రశేఖర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా చంద్రశేఖర్, ఏ2గా ఎమ్మెల్సీ జకియా ఖానం, ఏ3గా ఎమ్మెల్సీ పీఆర్వో కృష్ణతేజ పేర్లు చేర్చారు.
కాగా ఈ కేసుపై జకియా ఖానం తాజాగా స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. ‘నాపై వైసీపీ నేతలు కుట్రపన్నారు. ఇందులో భాగంగానే నా సిఫార్సు లేఖని మిస్ యూజ్ చేశారు. నా లెటర్‌ను డబ్బులకు అమ్ముకున్నారనే విషయం కూడా నాకు తెలియదు. పోలీసులు నాపై కేసు నమోదుచేశారని సమాచారం ఇవ్వడంతోనే ఈ విషయం నాకు తెలిసింది. కావాలనే కొందరు వైసీపీ నేతలు నాపై పనికట్టుకొని ఈ కుట్రలో ఇరికించారు’ అని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
తనకు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సీఎం చంద్రబాబునాయుడు నుంచి పిలుపు వచ్చిందని ఆమె తెలిపారు. దీంతో తాను ఆయనను కలిసేందుకు విజయవాడకు బయలుదేరుతున్నానని తెలుసుకున్న కొంతమంది వైసీపీ నేతలు తనపై ఈ కుట్రపన్నారని ఆరోపించారు. నిజాయితీగా ఉండే వారికి వైసీపీలో గౌరవం లేదని… అందులోనూ మైనార్టీ మహిళలను అసలు గౌరవించరని మండిపడ్డారు. దీనిపై న్యాయపరంగా పోరాడతానని జకియా వెల్లడించారు.