ఏపీలో మందుబాబులు తెగ తాగేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ మద్యం షాపుల బదులు ప్రైవేట్ వైన్ షాపులు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో నాసిరకం మద్యం కాకుండా బ్రాండెడ్ కంపెనీల మద్యం అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా మద్యం ధరలు కూడా భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో మద్యం ప్రియులు తమకు నచ్చిన బ్రాండ్‌ను తక్కువ ధరకే తాగి కిక్కులో మునిగి తేలుతున్నారు.
ఈ ఏడాది అక్టోబర్ 16వ తేదీ నుంచి ప్రైవేట్ లిక్కర్ షాపులు అందుబాటులోకి వచ్చాయి. ఆ రోజు నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.6,312 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు(AP Liquor Sales) జరిగినట్టు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. ఈ 75 రోజుల కాలంలో 26,78,547 కేసులు బీర్ల అమ్మకాలు జరగ్గా.. 83,74,116 కేసుల మద్యం అమ్మినట్టు అధికారులు చెబుతున్నారు. ఇక నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో మరింతగా మద్యం అమ్మకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు.