Sajjala Bhargavreddy| వైసీపీ సోషల్ మీడియా ఇంఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈనెల 8న కడపలో భార్గవరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసుతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ భార్గవరెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు ఆయనతో పాటు మాజీ సీఎం జగన్ మేనల్లుడు అర్జున్ రెడ్డి సహా మరికొందరిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విదేశాలకు పారిపోతారనే అనుమానంతో లుక్ ఔట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు.. వీరి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే అరెస్ట్ అయిన వైసీపీ కార్యకర్త వర్రా రవీంద్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు పొందుపరిచారు. “సజ్జల భార్గవరెడ్డి సోషల్ మీడియా ఇంఛార్జ్‌గా బాధ్యత తీసుకున్నాక మరింత రెచ్చిపోయాం. జడ్జిలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలని భార్గవరెడ్డి బెదిరించాడు. 2023 నుంచి నా ఫేస్‌బుక్ ఐడీతో సజ్జల భార్గవరెడ్డి పోస్టులు పెట్టేవారు. షర్మిల, సునీత, విజయమ్మపై అసభ్యకర పోస్టులు పెట్టాం. ఆ పోస్టులు పెట్టాలని ఎ్ంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి మాకు కంటెంట్ ఇచ్చేవారు. ఎలాంటి పోస్టులు పెట్టాలనేది అవినాష్ రెడ్డి, రాఘవరెడ్డి చర్చించేవారు. వారి ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన పిల్లలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టాను. వైసీపీ సోషల్ మీడియాలో భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి, సుమారెడ్డి కీలకం’’ అని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.