Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Amaravati Quantum Valley:రూ.1,772 కోట్ల భారీ పెట్టుబడితో..అమరావతికి మైక్రోసాఫ్ట్

Amaravati Quantum Valley:రూ.1,772 కోట్ల భారీ పెట్టుబడితో..అమరావతికి మైక్రోసాఫ్ట్

Amaravati Quantum Valley- Microsoft Investment:ఆంధ్రప్రదేశ్‌లో టెక్నాలజీ రంగం కొత్త దిశలో పయనిస్తోంది. రాష్ట్ర రాజధాని అమరావతి ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇక్కడ భారీ పెట్టుబడులతో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించబోతోంది. సుమారు రూ.1,772.08 కోట్ల వ్యయంతో అత్యాధునిక క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్‌ను స్థాపించేందుకు కంపెనీ ప్రతిపాదన సమర్పించింది. ఈ ప్రాజెక్ట్ అమలు అయితే, అమరావతి దేశంలోనే తొలి “క్వాంటమ్ వ్యాలీ”గా గుర్తింపు పొందే అవకాశం ఉంది.

- Advertisement -

మైక్రోసాఫ్ట్ ప్రతిపాదన ప్రకారం, ఈ కేంద్రంలో 1,200 క్యూబిట్ సామర్థ్యం గల క్వాంటమ్ కంప్యూటర్‌ను ఏర్పాటుచేయనున్నారు. అందులో 50 లాజికల్ క్యూబిట్లు ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ కోసం క్వాంటమ్ వ్యాలీ సమీపంలోని 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక భవనం నిర్మించనున్నారు. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కి 50 ఎకరాల భూమిని కేటాయించింది.

Also Read: https://teluguprabha.net/sports-news/pant-and-jaiswal-likely-to-replace-gill-and-samson-after-australia-series/

అమరావతి క్వాంటమ్ వ్యాలీ..

ఈ ప్రాజెక్ట్ రాకతో అమరావతి క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధికి మరింత ఊపందనుంది. ఇప్పటికే ఐబీఎం సంస్థ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఐబీఎం 133 క్యూబిట్ సామర్థ్యం గల క్వాంటమ్ కంప్యూటర్‌ను ఇక్కడే నిర్మించనుంది. టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి భారత ప్రముఖ సంస్థలతో కలిసి ఐబీఎం దేశంలోనే మొట్టమొదటి ఫుల్ స్టాక్ క్వాంటమ్ టెక్ పార్క్‌కి భాగస్వామిగా ఉంది.

ఇక మరో అంతర్జాతీయ సంస్థ ఫుజిట్సు కూడా అమరావతిలో అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ జపాన్ కంపెనీ 64 క్యూబిట్ సామర్థ్యం గల క్వాంటమ్ కంప్యూటర్‌తో పాటు ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. దీంతో అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ అంతర్జాతీయ స్థాయిలో టెక్నాలజీ హబ్‌గా ఎదగనుందనే అంచనాలు ఉన్నాయి.

ప్రభుత్వ ప్రణాళికలు స్పష్టంగా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ‘అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్’ అనే పత్రాన్ని రూపొందించింది. దీని ప్రకారం, 2029 జనవరి 1 నాటికి కనీసం 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఈ రంగంలోకి ఆకర్షించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. సిలికాన్ వ్యాలీ తరహాలో ఆవిష్కరణల కేంద్రంగా అమరావతిని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈ ప్రణాళిక రూపొందించారు.

ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ 2026 జనవరి 1న అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఆ తర్వాత దశలవారీగా పరిశోధన, శిక్షణ, పరిశ్రమల కోసం 90 లక్షల చదరపు అడుగుల మౌలిక సదుపాయాలు నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత వేలాదిమంది ఉద్యోగావకాశాలు రానున్నాయని తెలుస్తోంది.

క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ కేవలం టెక్నాలజీ అభివృద్ధి మాత్రమే కాదు, విద్యా, పరిశోధనా రంగాలకూ కొత్త ఊపునిస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని అనేక విశ్వవిద్యాలయాలు క్వాంటమ్ సైన్స్‌లో కోర్సులను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా విద్యా సంస్థలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనుంది.

క్వాంటమ్ టెక్నాలజీ ప్రాముఖ్యత

క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. సాధారణ కంప్యూటర్ల కంటే లక్షల రెట్లు వేగంగా లెక్కలు చేయగల ఈ టెక్నాలజీ, రాబోయే దశాబ్దంలో అత్యంత ప్రభావశీల రంగంగా ఎదుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఐక్యరాజ్యసమితి కూడా దీని ప్రాముఖ్యతను గుర్తించి 2025ను “అంతర్జాతీయ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరం”గా ప్రకటించింది.

క్వాంటమ్ టెక్నాలజీ రక్షణ, వైద్య, కమ్యూనికేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి పలు రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకురానుంది. అందుకే ప్రపంచంలోని అన్ని పెద్ద దేశాలు ఈ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ వంటి దేశాలు ఇప్పటికే తమ క్వాంటమ్ రీసెర్చ్ సెంటర్లను విస్తరించాయి.

ఈ నేపథ్యంలో అమరావతిలో మైక్రోసాఫ్ట్ ప్రవేశం భారతదేశానికి ఒక పెద్ద ముందడుగుగా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే, భారత్ క్వాంటమ్ రీసెర్చ్‌లో ప్రపంచంలో మూడవ స్థానంలో నిలిచే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అమరావతికి కొత్త గుర్తింపు

మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఫుజిట్సు వంటి కంపెనీలతో పాటు, అనేక స్టార్టప్‌లు కూడా అమరావతిలో పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. దీనివల్ల స్థానిక ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలు లభిస్తాయి. స్థానిక యువతకు టెక్నాలజీ రంగంలో నైపుణ్యాభివృద్ధి జరుగుతుంది.

Also Read:https://teluguprabha.net/sports-news/smriti-mandhana-nominated-for-icc-womens-player-of-the-month-award/

క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత అమరావతి కేవలం రాజధాని నగరమే కాకుండా, భారతదేశానికి ఒక టెక్నాలజీ సింబల్‌గా మారనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ, విద్య, పరిశ్రమల రంగాల్లో కొత్త దశను ప్రారంభించనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad