Wednesday, February 26, 2025
Homeఆంధ్రప్రదేశ్Tadipudi: గోదావరి స్నానానికి వెళ్లి ఐదుగురు యువకులు మృతి చెందిన ఘటనపై మంత్రి కందుల దుర్గేష్...

Tadipudi: గోదావరి స్నానానికి వెళ్లి ఐదుగురు యువకులు మృతి చెందిన ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాడిపూడి గ్రామం చెంతన ఉన్న గోదావరి నదిలో స్నానానికి దిగి ఐదుగురు యువకులు దుర్మరణం చెందడం బాధాకరమని మంత్రి కందుల దుర్గేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మహా శివరాత్రి పర్వదినాన పుణ్యస్నానాలు ఆచరించాలన్న ఉద్దేశంతో ఈత కూడా రాని సంబంధిత యువకులు బుధవారం ఉదయం ప్రమాదవశాత్తు గోదావరిలోని నిషిద్ధ ప్రాంతంలో దిగి గల్లంతయ్యారని, గజ ఈతగాళ్లతో కూడిన రెస్క్యూ టీం చెమటోడ్చి గాలింపు చర్యలు చేపట్టి త్వరితగతిన మృతదేహాలను వెలికితీసిందన్నారు.సంబంధిత మృతదేహాలను కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా తాను స్వయంగా చూసి రావడం జరిగిందన్నారు.

- Advertisement -

20 ఏళ్లు కూడా నిండని ఆ యువకుల మృతదేహాలను చూసి మనసు కలచి వేసిందన్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు మంత్రి దుర్గేష్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. కుటుంబానికి ఆసరాగా నిలవాల్సిన తనయులను కోల్పోవడం వారి తల్లిదండ్రులకు తీరని శోకమన్నారు. ముందు జాగ్రత్తలు తీసుకొని సురక్షిత ఘాట్లలో దిగి స్నానం చేసి ఉంటే ప్రమాదం తప్పి ఉండేదన్నారు. ఘటనకు సంబంధించిన సమాచారం తెలియగానే ప్రభుత్వం స్పందించి రెస్క్యూ టీంను పంపించిందన్నారు. వెంటనే రెస్క్యూ బృందం స్పందించిన తీరు అభినందనీయమన్నారు.

బాధిత కుటుంబాలకు మాది భరోసా:మంత్రి దుర్గేష్
సంబంధిత కుటుంబాలకి ప్రభుత్వం తరపున ఎక్స్ గ్రేషియా అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లానన్నారు. సంబంధిత యువకులు జనసేన సభ్యత్వం కలిగి ఉన్నారని తెలిసిందని, పార్టీ సభ్యత్వం కలిగి ఉంటే గనుక పార్టీ తరపున తప్పకుండా రూ.5 లక్షలు వచ్చేందుకు కృషి చేస్తానన్నారు.

ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందించేందుకు ఆస్కారం ఉంటుందని కానీ పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేమని బాధాతప్త హృదయంతో అన్నారు. తల్లిదండ్రుల కడుపుశోకాన్ని తగ్గించగలం కానీ ఆసరాగా నిలవాల్సిన తనయులను కోల్పోయిన వ్యధను తీర్చలేమన్నారు. ఇలాంటి పుణ్య స్నానాలు ఆచరించే సమయంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి దుర్గేష్ సూచించారు. ఈ విషయంలో పెద్దలు కూడా పిల్లలకు తగు జాగ్రత్తలు తెలపాల్సిన అవసరం ఉందన్నారు.

2027 గోదావరి పుష్కరాల నాటికి ఘాట్లన్నీ సురక్షితంగా ఉండేలా తీర్చిదిద్దుతామని మంత్రి దుర్గేష్ అన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రమాద ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా అధికార యంత్రాంగం దృష్టి పెట్టాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News