వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన మృతుల కుటుంబాలను మంత్రులు అనిత, అనగాని సత్య ప్రసాద్, ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథి నిమ్మల రామానాయుడు, సత్యకుమార్ యాదవ్, చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పరామర్శించారు.
అనంతరం మీడియాతో మంత్రులు మాట్లాడుతూ.. తొక్కిసలాట ఘటన ప్రమాదామా.. లేదా కుట్ర ఉందా..? అనే కోణంలో విచారణ జరుగుతుందన్నారు. మృతిచెందిన మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్లు పొందే ప్రతి చోట సీసీ కెమెరాలు ఉన్నాయని వాటిని పరిశీలించి విచారణ చేపడతామన్నారు. సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
తొక్కిసలాట సంఘటన తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు(CM Chandrababu) తమను తిరుపతి(Tirupati)కి పంపడం జరిగిందని తెలిపారు. ఈ సంఘటన దురదృష్టకరమని ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. మృతులు తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రాలకు చెందినవారని.. వారి మృతదేహాలను ప్రత్యేక వాహనం ద్వారా వారి స్వగ్రామాలకు చేర్చడం జరుగుతుందన్నారు.