MLA Kotamreddy Traffice Police Issue: అది నెల్లూరు వేదాయపాలెం సర్కిల్. సాధారణంగా అర్ధరాత్రి ఎవరైనా ఇంటికి చేరే తంతులో ఉంటారు. అలాగే ఓ దంపతుల జంట బైక్‌పై ఇంటికి వెళ్తున్నారు. అయితే… మార్గమధ్యంలో తనీఖీలు చేస్తోన్న ట్రాఫిక్ పోలీసులు వారిని ఆపారు. తాగి వాహనం నడుపుతున్నావని డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో రూ.10,000 జరిమానా వేస్తామన్నారు. దీంతో ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు ఆ దంపతులు. సార్, మేమేం తాగలేదు.. అని ఎంత చెప్పినా… అధికారులు వినలేదు. బైక్ ను తీసుకెళ్లిపోయారు. అప్పుడు ఏం చేయాలో అర్ధం కాక.. చివరకు ఆ దంపతులు చేసిన పని ఒక్కటే .. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఫోన్..
నేరుగా సంఘటనా స్థలానికి..
వెంటనే ఎమ్మెల్యే కోటంరెడ్డి నేరుగా ఘటనా స్థలానికి చేరుకొని.. బాధితులను పరామర్శించడంతో పాటు ట్రాఫిక్ పోలీసులకు ఫోన్ చేశారు. మీకు మానవత్వం లేదా అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఆర్టీసీ బస్టాండ్ దగ్గరే ఉన్నానని.. తక్షణమే బైక్‌ను బాధితులకు హ్యాండోవర్ చేయాలని పోలీసులను ఆదేశించారు. దీంతో క్షణాల్లో బైక్‌ను తీసుకొచ్చి దంపతులకు అప్పజెప్పారు సదరు అధికారులు.
కాళ్లు మొక్కిన దంపతులు..
ఎట్టకేలకు తమ సమస్య తీరడంతో అప్పుడు ఊపిరి పీల్చుకుంది ఆ జంట. అర్థరాత్రి సమయంలో ఫోన్ ఎత్తి, తమ కోసం ఘటనా స్థలానికి వచ్చి చేసిన సాయానికి ఆ దంపతులు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కోటంరెడ్డి పాదాలను తాకి కృతజ్ఞత తెలిపారు. అలా ఈ తతంగమంతా జరగడంతో ఒక్కసారిగా నెల్లూరు బస్టాండ్ దగ్గర కాస్త హడావుడి నెలకొంది. చుట్టుపక్కల జనాలు గూమిగూడారు. అక్కడే ఉన్న స్థానికులు జరిగిన సంఘటాన్ని తమ ఫోన్లలో చిత్రీకరించడం, వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగిపోయింది.


