సినీ నటుడు తారకరత్న.. చేసింది చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సినిమాల్లో లేరు కానీ.. టీడీపీ కార్యక్రమాల్లో ఎప్పుడూ బిజీగా ఉంటుంటారు. పార్టీ కోసం తనవంతు కృషి చేస్తుంటారు. సోమవారం గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రు గ్రామంలో తన తాత, మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు తారకరత్న విచ్చేశారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబులిచ్చారు తారకరత్న. ఈ సందర్భంగా.. తాను ఇకపై ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నానని స్పష్టం చేశారు. ఇప్పటివరకూ టీడీపీ కార్యకర్తగా పనిచేసిన తాను.. నాయకుడిని కూడా కావొచ్చని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
త్వరలోనే ఏపీ నుండి ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. ఎన్టీఆర్ టీడీపీకి దూరంగా ఉండటంపై.. మీడియా మిత్రులు ప్రశ్నించారు. లోకేష్ కోసం ఎన్టీఆర్ ను దూరంగా ఉంచారా? అని ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని ఆ వార్తలను ఖండించారు తారకరత్న. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలసిన టైమ్ లో వస్తారని, ప్రతి దానికి కాలమే సమాధానం చెబుతుందన్నారు. నందమూరి కుటుంబ సభ్యులు ఎలాంటి పదవులను కోరుకోరని, ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. తాము ప్రజల సంక్షేమం కోసం పోరాడుతామని, పోరాడుతూనే ఉంటామని చెప్పారు. రాజకీయాల్లో తన బాబాయ్ బాలకృష్ణే తనకు ఆదర్శమన్నారు తారకరత్న. అలాగే మామయ్య చంద్రబాబు కూడా గొప్ప నాయకుడని, మామయ్యకు అండగా ఉంటామని, ఆయన అడుగుజాడల్లో నడుస్తామని తెలిపారు. నందమూరి, నారా కుటుంబాలు వేర్వేరు కాదని, ఎప్పటికీ కలిసే ఉంటాయని పేర్కొన్నారు.